సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్‌లో ఉమ్మడి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ నేతలతో సమావేశం అయ్యారు. కేటీఆర్, హరీష్ రావుతో పాటు సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా కీలక నేతలు హాజరయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటి నుంచే నియోజకవర్గాల వారిగా సన్నాహక సమావేశం పెట్టుకోవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో నియోజకవర్గం నుంచి లక్ష మందికి తగ్గకుండా లక్షలాది మందితో సభ నిర్వహించేలా ప్లాన్ ఉండాలన్నారు. ఆ దిశగా ఫామ్ హౌస్‌కు చేరుకుంటున్న బీఆర్ఎస్ మాజీ తాజా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ లు.ముఖ్య నేతలకు కేసీఆర్ సూచనలు చేస్తున్నారు.
కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నిన్న(మంగళవారం) కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నెల 27వ తేదీన వరంగల్‌లో జరుగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై చర్చించారు. బహిరంగ సభ ఏర్పాట్లపై వరంగల్ జిల్లా నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్టీ స్థాపించి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ నాయకులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ఏర్పాట్లు, నిర్వహణ, జన సమీకరణ వంటి అంశాలపై కేసీఆర్ నేతలకు దిశా నిర్దేశం చేశారు.
తెలంగాణ ప్రజానీకానికి మనోధైర్యం ఇచ్చేలా బీఆర్ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ ఉండాలని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ సభకు వచ్చే జనానికి అనుగుణంగా విస్తృత ఏర్పాట్లు చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వరంగల్ బహిరంగ సభ తర్వాత గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీ కమిటీలు వేసి.. ఆ తర్వాత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. కేసీఆర్ ఆదేశాల మేరకు వరంగల్ సభను విజయవంతం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అనేక సభలను నిర్వహించిన ఘనత వరంగల్‌కు ఉందని.. నాటి ఉద్యమ స్ఫూర్తితో మరోసారి పని చేస్తామని చెప్పారు. అభివృద్ధిలో హైదరాబాద్‌తో పోటీపడేలా వరంగల్‌ను తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
బీఆర్‌ఎస్ సిల్వర్‌జూబ్లీ సభ కోసం ప్రజలు ఆతృతతో ఎదురుచూస్తున్నారని కేసీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్ బహిరంగ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారని చెప్పారు. బీఆర్‌ఎస్ సభకు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పాలన వింతగా ఉందని కామెంట్స్ చేశారు. మార్పు కోరుకున్న రైతుల కళ్లల్లో కన్నీళ్లే మిగిలాయన్నారు. రైతులకు ఈ దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదని అన్నారు. ప్రభుత్వ చర్యలతో రైతులు, వివిధ వర్గాల ప్రజలు మనోధైర్యం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..