*షాద్ నగర్ లో ఘనంగా రంజాన్ ప్రార్థనలు.
*వేలాదిగా ఈద్గాకు తరలివచ్చిన ముస్లిం సోదరులు.
*ప్రార్థనల అనంతరం అలైబలైలతో శుభాకాంక్షలు.
*ఈద్గా వేదికపై ఇస్లాం గురువుల కీలక ప్రసంగాలు.
ఈ ప్రపంచంలో సర్వ మతాల సారాంశం ఒక్కటేనని, సర్వ ధర్మాలు జీవకోటి పరిరక్షణ కోసం తోడ్పాటును అందిస్తాయని షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, ఫరూక్ నగర్ లో రంజాన్ పండుగను పురస్కరించుకుని సోమవారం పెద్ద ఎత్తున ఈద్గా వద్ద ప్రార్థనలు జరిగాయి. దీనికి ఈ ప్రాంతంలోని ముస్లింలు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
తదితర కాంగ్రెస్ శ్రేణులు ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలైబలై చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను పలువురు ప్రముఖులు ఇదిగో వద్ద ప్రత్యేకంగా కలుసుకున్నారు వారందరికీ ఎమ్మెల్యే రంజాన్ పండుగ శుభాకాంక్షలు స్వయంగా తెలియజేశారు. సీనియర్ జర్నలిస్టు కేపీ తదితర మైనార్టీ సోదరులను కలిసి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.
అన్ని మత గ్రంథాల సారాంశం, వాటి ధర్మాలు ఒకటేనని తెలిపారు. రంజాన్ మాసంలో నెల రోజులపాటు జడ్పి ఉపవాస దీక్షల కారణంగా ఎంతో మహత్యం ఉంటుందని వాటి వల్ల మానవాళి ప్రశాంతమైన జీవనం కొనసాగిస్తారని పేర్కొన్నారు. పేదలను ఆదుకోవడం, దానధర్మాలు చేయడం ఈ మాసం ప్రత్యేకత అని పేర్కొన్నారు.
*ఘనంగా రంజాన్ ప్రార్థనలు*
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ఈద్గా వద్ద సోమవారం పెద్ద ఎత్తున ఈదుల్ ఫితర్ నమాజ్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మత పెద్దలు అనేక విషయాలను ముస్లిం సోదరులకు బోధించారు.
ఉపవాసాలు, దానధర్మాలు, ప్రత్యేక నమాజ్‌లు, ఆరాధనలతో రంజాన్ మాసం ముగిసిందనీ తనపట్ల భక్తిని, నమ్మకాన్ని మరింత పటిష్టపరచుకొనే అవకాశాన్ని విశ్వాసులకు అల్లాహ్ అనుగ్రహించాడన్నారు. దీనికి కొనసాగింపుగా… రంజాన్ మాస ఉపవాసాలను పూర్తి చేసిన తరువాత… తదుపరి మాసమైన షవ్వాల్‌లో ఆరు రోజులు ఉపవాసాలు చేసే సంప్రదాయం ఉంది. సాధారణంగా… ‘ఈద్-ఉల్-ఫితర్’ జరుపుకొన్నాక… రెండో రోజు నుంచి ఈ ఉపవాసాలను పాటిస్తారనీ ఎవరైతే రంజాన్ ఉపవాసాలు చేసి, ఆ తరువాత షవ్వాల్ మాసంలో ఆరు రోజులు ఉపవాసాలు ఉంటారో… వారు ఏడాదంతా ఉపవాసాలు చేసినట్టేనని దైవ ప్రవక్త మహమ్మద్ తెలిపారనీ మత పెద్దలు సూచించారు. రంజాన్ ఉపవాసాలను, షవ్వాల్ ఉపవాసాలను పాటించిన వారు తల్లి గర్భంలోంచి అప్పుడే పుట్టినంత పవిత్రులవుతారని, వారు ఎప్పుడూ ఉపవాసాలు పాటిస్తున్నవారిగా పరిగణన పొందుతారని హదీస్ గ్రంథం చెబుతోంది. ఎల్లప్పుడూ ఉపవాసం పాటించడం గురించి తనకు ఎదురైన ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు దైవ ప్రవక్త సమాధానం ఇస్తూ ‘‘రంజాన్ ఉపవాసాలతో పాటు తరువాతి నెలలోని (ఆరు రోజుల) ఉపవాసాలను కూడా పాటించు. అలాగే బుధ, గురువారాల్లో ఉపవాసం ఉండు. దీనివల్ల నువ్వు ఎల్లప్పుడూ ఉపవాసాలు పాటించేవాడిగా పరిగణన పొందుతావు’’ అని చెప్పారు. ‘‘ఎవరైనా రంజాన్ మాసమంతా ఉపవాసాలు ఉంటే… అతనికి పది నెలల పుణ్యం వస్తుంది. షవ్వాల్‌లోని ఆరు రోజుల ఉపవాసాల వల్ల అరవై రోజుల పుణ్యం లభిస్తుంది. ఈ విధంగా పన్నెండు నెలలు… అంటే ఏడాది కాలం ఉపవాసాలు చేసినంత పుణ్యం వారికి దక్కుతుంది’’ అని దివ్య గ్రంథాలు పేర్కొంటున్నాయి. కాగా, ‘‘రంజాన్ మాసంలో చేసిన ఉపవాసాల్లో ఏవైనా పొరపాట్లు జరిగితే… షవ్వాల్ ఉపవాసాల ద్వారా ఆ పొరపాట్లను అల్లాహ్ మన్నిస్తాడు. నమాజ్‌లలో ఏర్పడిన లోపాలను తొలగిస్తాడు’’ అని పూర్వ ఉలేమాలు (ఇస్లాం గురువులు) స్పష్టం చేశారనీ ఈ సందర్భంగా రంజాన్ వేడుకల సందర్భంగా ఈద్గా వేదికపై ప్రసంగాలు చేశారు..