హైదరాబాద్: అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తమ్ముడూ నీ లైఫ్ స్టైల్ వేరు..నా లైఫ్ స్టైల్ వేరు’ అని సీతక్క చెప్పారు. ములుగు నియోజకవర్గంలో తాను తిరిగినట్లు నువ్వు తిరగలేవు అని చెప్పారు. ప్రజలకు ఎవరు ఎక్కువ అందుబాటులో ఉంటారో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సన్నవడ్లకు బోనస్ ఇవ్వడం లేదన్న కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క ఖండించారు.
వరి వేస్తే ఉరి అనలేదా..
హైదరాబాద్‌లో తిరిగే వాళ్లకు రైతులకు బోనస్ వస్తుందో లేదో తెలుస్తుందా అని ప్రశ్నించారు. రైతులతో సంబంధం లేకుండా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నేతలు తిరుగుతున్నట్లు ఉందని విమర్శించారు. బోనస్ ఇస్తామని చెప్పి రైతులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం బోగస్ చేసిందని ఆరోపించారు. వరి వేస్తే ఉరి అన్నది మాజీ సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సన్నవడ్లకు రూ.1200 కోట్లు బోనస్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఇంకా ఎవరికన్నా రాకపోతే అవి కూడా ఇస్తామని స్పష్టం చేశారు. రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నామని ప్రకటించారు. భూమి లేని వాళ్లకే కూలీ భరోసా ఇస్తున్నామని చెప్పారు. కొంత భూమి ఉన్న కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలనే అంశం పరిశీలనలో ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
నేను ఉండేది అక్కడే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తమ ఇంటికి రావాలని మంత్రి సీతక్క ఆహ్వానం పలికారు. ప్రభుత్వం వసతి కల్పించిన క్వార్టర్స్‌లోనే తాను నివసిస్తున్నానని స్పష్టం చేశారు. వైఎస్ భవనంలో ఉండటం తాను అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. అది వైఎస్ హయాంలో నిర్మించిన భవనమేనని చెప్పారు. ఆ భవనంలోనే తాను ఉంటున్నానని అన్నారు. బీఆర్ఎస్ నేతళ్లాగా ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన కోటల్లో తాను నివసించడం లేదని తేల్చిచెప్పారు. తమ ఇంటికి వస్తే అన్ని విషయాలు తెలుస్తాయని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరిని భోజనానికి ఆహ్వానిస్తున్నానని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ ఆహ్వానించలేదని చెప్పారు. నాది నిరాడంబర జీవితమని ఉద్ఘాటించారు. తన కుమారుడు కూడా హన్మకొండలోనే ఉంటారని మంత్రి సీతక్క పేర్కొన్నారు..