హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలకు ధరణితో దోచుకుతినడం తప్పా ఏమి తెలవదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు. ఈరోజు(శనివారం) అసెంబ్లీ మీడియా పాయిట్‌లో బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ తండ్రి చాటు కొడుకు.. మాజీ మంత్రి హరీష్‌రావు మామ చాటు అల్లుడని ఎద్దేవా చేశారు. వాళ్లు కనీసం డిప్యూటీ లీడర్లు కూడా కాదని విమర్శించారు. వాళ్లతో తాము ఏం మాట్లాడతామని దెప్పిపొడిచారు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అప్పుడు డమ్మీ మంత్రిగా ఉండే వారని విమర్శించారు. ఆయనను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కనీసం గుర్తు కూడా పట్టారని అన్నారు. ప్రశాంత్ రెడ్డి మెంటల్ పట్టినట్లుగా మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శించారు.
ఉప్పల్, నారపల్లి ఫ్లై ఓవర్ పనులు గడ్కరీతో మాట్లాడి తాను చేపిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు అబద్దాలతో బతకడం బాగా అలవాటైందని ఎద్దేవా చేశారు. త్వరలో ఉస్మానియా హాస్పిటల్‌కు టెండర్లు పిలుస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ నేతలకు మెంటల్.. మైండ్ పనిచేయడం లేదని విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలను ఎర్రగడ్డ హాస్పిటల్‌కు పంపించాలని ఎద్దేవా చేశారు. పదేళ్లలో మాజీ సీఎం కేసీఆర్ చెప్పిన అబద్ధాలకు అసలు శిక్షలే సరిపోవని చెప్పారు. కేసీఆర్ పదిలక్షల అబద్ధాలు ఆడారని విమర్శించారు. కేసీఆర్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలని అన్నారు. దళితుడిని సీఎం చేయకపోతే తల తీసుకుంటానని ఆయన అన్నారని గుర్తుచేశారు. కేసీఆర్‌ను తలతీసి ఇవ్వమని అడగాలని అన్నారు. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోమని చెప్పాలన్నారు. బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో అర్థంలేని ప్రశ్నలు వేస్తున్నారని విమర్శించారు. సభలో హరీష్‌రావు వేసిన ప్రశ్నే తప్పు అని చెప్పారు. ఏడేళ్ల నుంచి నారపల్లి బ్రిడ్జ్ కట్టలేక పోయిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తనపై మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు చేశారు..