కరీంనగర్, మార్చి 20: సాధారణంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. పలు కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు చెప్పిన ఆదేశాలను అధికారులు పాటిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరిద్ధరి మధ్య వివాదాలు తలెత్తడం అరుదుగా చూస్తుంటాం. ప్రోటోకాల్‌తో పాటు కార్యక్రమాల ఏర్పాటు సంబంధిత విషయాల్లో అధికారులు, ఎమ్మెల్యేల మధ్య చిన్నపాటి వివాదాలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. ఎమ్మెల్యేల మాటలను లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించిన అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు చూస్తుంటాం. తాజాగా జగిత్యాల జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. జగిత్యాల అడిషనల్ కలెక్టర్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం పెను దుమారాన్ని రూపుతోంది. ఇంతకీ అడిషనల్ కలెక్టర్ ఏమన్నారు.. అందుకు ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అయ్యారో ఇప్పుడు చూద్దాం.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల అడిషనల్ కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నట్లుగా పరిస్థితులు మారాయి. ఓ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీలత చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఓ అధికారిగా ఉంటూ ఇలాంటి కామెంట్స్ తగదని అన్నారు. యువతకు చెడు సంకేతాలు వెళ్తాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
అసలేం జరిగిందంటే
దేశంలో పొలిటికల్ పొల్యూషన్ ఎక్కువైందని అడిషనల్ కలెక్టర్ శ్రీలత అన్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంశంపై మాట్లాడుతూ శ్రీలత ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే అడిషనల్ కలెక్టర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక బాధ్యతగల అధికారి ఇలా మాట్లడకూడదని సూచించారు. సీరియస్ అంశాన్ని జనరలైజ్ చేసి మాట్లాడకూడదని అన్నారు. ఈ వ్యాఖ్యల వల్ల యువతకు చెడు సంకేతాలు వెళ్తాయని చెప్పుకొచ్చారు. బాధ్యత గల అధికారిగా ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడవద్దని అడిషనల్ కలెక్టర్ శ్రీలతకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ హితవుపలికారు. ప్రస్తుతం ఎమ్మెల్యే చేసిన ఈ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి..