నిజామాబాద్: పసుపు రైతుల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రేవంత్ ప్రభుత్వం ఏం చేస్తోందని నిలదీశారు. ఇవాళ(మంగళవారం) తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో కవిత మాట్లాడారు. మాటలు చెప్పిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి ఎందుకు ముందుకు రావడం లేదని కవిత ప్రశ్నించారు.

క్వింటా పసుపు పంటకు రూ.15 వేల ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు పసుపు పంటకు కనీసం రూ. 9 వేలు రాని పరిస్థితి ఉందన్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడానికి చర్యలు తీసుకోకపోవడం దారుణమని ధ్వజమెత్తారు. ఇది రైతులను నయవంచన చేయడమే, మోసం చేయడమేనని కవిత విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రూ.15 వేల మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తీసుకువచ్చామని చెబుతున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని మండిపడ్డారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేకపోవడంతో రైతులకు ప్రయోజనాలు కలగడం లేదని అన్నారు. పసుపు పంటకు ధరలు పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారని .. కానీ ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపించడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి పసుపు రైతులను ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *