24 దాకా నిర్వహణ.. 4 పథకాల కోసం అర్హుల గుర్తింపు_*

 

*_అర్హత ఉన్నా పేర్లు లేకపోతే మళ్లీ దరఖాస్తుల స్వీకరణ_*

 

*_గ్రామసభల్లో జాబితా ప్రదర్శన.. 26న పథకాల ప్రారంభం_*

 

 

హైదరాబాద్‌, జనవరి 21 : నాలుగు ప్రతిష్ఠాత్మక పథకాలకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామసభల నిర్వహణకు వేళైంది. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, కొత్త రేషన్‌కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు మంగళవారం నుంచి 24వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నారు. అనంతరం.. ఈ పథకాలను 26న ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. ప్రజాపాలన దరఖాస్తులు, గతంలో మీ-సేవ కేంద్రాల్లో వచ్చిన దరఖాస్తులు, కులగణన, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితా సిద్ధం చేశారు. దాని ఆధారంగా ఆయా కుటుంబాల ద్వారా సమగ్ర సమాచారం రాబట్టారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో కార్యదర్శుల సమక్షంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోల సహకారంతో సర్వే నిర్వహించారు. నాలుగు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను గ్రామసభల్లో ప్రజల ముందు వెల్లడిస్తారు. అక్కడ వచ్చే అభ్యంతరాలు, అభ్యర్థనలను ఆధారంగా చేసుకొని తుది అర్హుల జాబితాను సిద్ధంచేయనున్నారు.

 

సాగుకు యోగ్యమైన భూమికి ఎకరాకు ఏడాదికి రైతుభరోసా కింద రూ.12వేలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమిలేని ఉపాధి కూలీలకు ఏటా రూ.12వేలు రెండు విడతల్లో అందించనున్నారు. నిరుడు కనీసం 20 రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసిన వారికే ఇందిరమ్మ భరోసా పథకం వర్తించనుంది. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కొత్త రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు అందనున్నాయి. ప్రజాపాలన, కులగణన సర్వేతోపాటు 2014నుంచి ఇప్పటివరకు కొత్తరేషన్‌ కార్డులకోసం మీసేవ ద్వారా సమర్పించిన దరఖాస్తులను సాంకేతిక సమాచారం ద్వారా అర్హులను గుర్తించారు. వాటి ఆధారంగా ఆ కుటుంబాల వద్దకువెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం తర్వాత కొత్తకార్డుల జారీకి చర్యలు చేపట్టనున్నారు. ఇదిలాఉండగా.. సర్వేలో పేర్లు రానివారు తిరిగి గ్రామసభల్లో దరఖాస్తులు సమర్పించొచ్చునని అధికారులు చెబుతున్నారు. సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందుతాయని ప్రజలకు వారు భరోసా కల్పిస్తున్నారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *