హైదరాబాద్: ఆరాంఘర్- జూ పార్క్ ఫ్లైఓవర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. రూ.799 కోట్ల జీహెచ్ఎంసీ నిధులతో ఆరాంఘర్ చౌరస్తా నుంచి జూపార్క్ వరకూ 6 లైన్ల ఫ్లైఓవర్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. 4.08 కిలోమీటర్ల పొడువు, 23 మీటర్ల వెడల్పుతో అధికారులు దీన్ని నిర్మించారు. నగరంలో పీవీ ఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఇదే రెండో అతి పెద్ద ఫ్లైఓవర్. కాగా, ఇవాళ (సోమవారం) మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, అధికారులతో కలిసి దీన్ని ఘనంగా ప్రారంభించారు. ఫ్లై ఓవర్ ప్రారంభం కావడంతో నగరంలో ట్రాఫిక్ కష్టాల నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది.
ఆరాంఘర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే బెంగళూరు హైవే నుంచి హైదరాబాద్ నగరంలోకి ట్రాఫిక్ అంతరాయం లేకుండా తేలికగా ప్రవేశించవచ్చు. అలాగే ఎంజీబీఎస్ బహదూర్‌పుర నుంచి ఎయిర్‌పోర్ట్, బెంగళూరు హైవేకు ఈజీగా వెళ్లొచ్చు. తాడ్ బన్ జంక్షన్, దానమ్మ హాట్స్, శాస్త్రీపురం, హాసన్ నగర్, శివరాంపల్లి జంక్షన్ల వద్ద ట్రాఫిక్ చిక్కులు లేకుండా ఫ్లైఓవర్ పైనుంచి నగర వాసులు సులభంగా ప్రయాణించవచ్చు. ఎస్ఆర్డీపీ కింద నిర్మిస్తున్న 42 ప్రాజెక్టుల్లో ఇప్పటివరకూ 36 ఫ్లైఓవర్లు, అండర్ పాసులు అందుబాటులోకి వచ్చాయి. కాగా, 37వ ప్రాజెక్టుగా ఆరాంఘర్-జూ పార్క్ ఫ్లైఓవర్ తాజాగా అందుబాటులోకి వచ్చింది..