పేద, మధ్య తరగతి ప్రజలు ఏవైనా ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు పొందాలంటే ఇప్పటివరకు కొలబద్ధ రేషన్ కార్డు. అందుకే ప్రతి సామాన్య కుటుంబం రేషన్ కార్డు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తుంటారు. ప్రతినెలా తీసుకునే రేషన్ కంటే ప్రభుత్వం అందించే ఇతర సంక్షేమ పథకాలకు ప్రభుత్వాలు రేషన్‌కార్డు తప్పనిసరి నిబంధన పెట్టడంతో ఆ కార్డుకు ఎక్కువ డిమాండ్ ఉంది. తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు వస్తాయని ప్రజలు ఎదురుచూసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీకి మంత్రిమండలి ఇటీవల ఆమోదం తెలపడంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న జనంలో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే ఈ రేషన్ కార్డు కోసం ఏమి చేయాలి, ఎలా పొందాలనే అనుమానాలు చాలామందికి ఉండొచ్చు. జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు జారీచేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఈ క్రమంలో కొత్త కార్డు పొందాలంటే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇప్పటికే స్వీకరించిన దరఖాస్తులు

 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తులను స్వీకరించారు. ఈ దరఖాస్తుతోనే రేషన్ కార్డులు లేనివారు తమ వివరాలను పొందుపర్చారు. రేషన్ కార్డుకోసం దరఖాస్తుచేసుకున్న వారి వివరాలు పరిశీలించిన ప్రభుత్వం.. అర్హులను గుర్తించినట్లు తెలుస్తోంది. వీరికి కొత్త రేషన్ కార్డులను జనవరి 26న అందించనుంది. అదే విధంగా ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అర్హులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించనుంది. ఈనెల15వ తేదీ నుంచి వారం రోజుల పాటు దరఖాస్తులను స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డులను జారీ చేయనుంది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు సమర్పిస్తే ఈనెలలోనే కొత్తకార్డులు ఇంటికి రానున్నాయి.

 

రేషన్ కార్డులతో లింక్..

 

ఇప్పటివరకు ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డుతో లింక్ పెట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక నుంచి ఆ విధానంలో మార్పులు తీసుకువచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రేషన్ కార్డుతో సంబంధం లేకుండా అర్హులను ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయాలనే ప్రణాళికను రూపొందించినట్లు సమాచారం. రేషన్ కార్డుతో ప్రభుత్వ పథకాలను ముడిపెట్టడం ద్వారా అనర్హులు సైతం రేషన్ కార్డులు పొందుతుండటంతో ప్రభుత్వం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *