* *నమో నారసింహా*
*కన్నుల పండువగా సాగిన రథోత్సవం*
*గోవింద నామస్మరణతో మార్మోగిన నింబా చలం*
సదాశివ్ A9 న్యూస్ ప్రతినిధి బాల్కొండ నియోజకవర్గం
భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్మీ నృసింహుని కార్తీక మాస బ్రహ్మోత్సవాల్లో భాగంగా కార్తీక పౌర్ణమి శుక్రవారం నాడు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది . బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవాన్ని ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నంబి పార్థసారథి, నంబి విజయసారథి, నంబి వాసు దేవాచార్యులు ఇతర అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య స్వామివారి రథ ప్రతిష్ట జరిపారు. శ్రీమన్నారాయణుడిని ఆహ్వానించి షోడశోపచార పూజలు నిర్వహించారు. రథ ప్రథమ స్థలమందు గరుత్మంతునికి ప్రాణప్రతిష్ఠ గావించారు. రథానికి జీవకళ చేకూర్చేందుకు తత్వన్యాస మొనరించారు. రథచక్రాలలోలోకి ప్రతాప వంతుడైన వాయు పుత్రుని ఆహ్వానించారు .
స్తంభాది మొదలగు అభిమాన దేవతలకు రథ శక్తి హోమం నిర్వహించారు. రథాన్ని లాగేందుకు తక్షకుడిని, కర్కోటకుడిని ఆహ్వానించి ప్రాణ ప్రతిష్ట చేశారు. రథ ప్రతిష్ట సంపూర్ణ ఫలం కోసం హోమం పూర్ణాహుతి నిర్వహించి అగ్నిహోత్రానికి ప్రత్యేక పూజలు చేశారు.శాస్త్రప్రోక్తమైన రథ ప్రతిష్టా హోమముచే జీవకళలు ఉట్టి పడునట్టు రథము స్వర్ణాలంకార శోభతమై, నాలుగు దిక్కులకు నాలుగు దిక్కులకు భగవంతుని పఠములను అలంకరించారు. రథము యొక్క మూడవ తలములో గల భగవంతుని సింహాసన స్థలం లో శ్రీ లక్మీ నృసింహుని మోయుటకు సిద్ధముగా ఉన్న గరుత్మంతునితో అలారారే మహారథమునకు పూర్వ ప్రతిష్టా కుంభముచే ప్రోక్షణ నొనరించి అష్ట దిక్కులకు బలి ప్రధానమోనరించారు.
శ్రీ లక్మీ నృసింహుడు మూడవ తలమున ఆశీనులను జేసీ మంగళ
హారతి నొసంగిన తరవాత భక్త జనులందరు జయ గోవింద అను శబ్దములు, డప్పుల చప్పుల్లు, మంగళ వాయిద్యాలు మొగుతుండగా ఉప్పొంగిన భక్తితో రథ భ్రమణము గావించారు. రథముపై ఆశీనులైన శ్రీ కేశవుని ( శ్రీ లక్మీ నృసింహుని ) చూసిన వారికి పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం.
*పోటెత్తిన భక్తజనం*
రథోత్సవాన్ని పురస్కరించుకుని గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకునేందుకు భక్తులు ఉదయం నుండే బారులు తీరారు .వివిధ దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు హాజరయ్యారు. వేకువ జాము నుండి పుష్కరిణి వీధుల నుండి మెట్ల మార్గం గుండా గర్భాలయం లో స్వామి వారి వరకు రద్దీ కనిపించింది. జాతరను పురస్కరించుకుని అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి స్వర్ణాలంకరణ చేశారు. దేదీప్యామానమైన స్వామిని దర్శించుకుని భక్తులు తన్మయత్నం చెందారు.
*బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు*
రథోత్సం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు సీఐ నవీన్, ఎస్సై మహేష్ అద్వర్యంలో పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. గర్భాలయంలోని మెట్ల మార్గం ద్వారా దర్శనానికి వెల్లే భక్తుల క్రమబద్దీకరణ నుండి రథోత్సవం ముగిసే వరకు బందో బస్తు చర్యలను పకడ్భందిగా నిర్వహించారు.
*రథోత్సవంలో ప్రముఖులు*
లింబాద్రి క్షేత్రంపై శుక్రవారం నిర్వహించిన రథోత్సవంలో ప్రముఖులు పాల్గొన్నారు. బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్, తెలంగాణ కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునిల్ కుమార్, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దోళ్ల గంగారెడ్డి, మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత, సురేందర్ వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.