లగ్గమంటే మాటలా, పెళ్లి చేసి చూడు.. అని లోకోక్తులు. నేటి కాలంలో ఆడపిల్లల లగ్గం చేయాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే ఆర్థికంగా ఆడపిల్లల తల్లిదండ్రులను కొంతమేర ఆదుకోవాలనేది ప్రభుత్వ లక్ష్యం. గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి సబందించిన నగదు కోసం దరఖాస్తుదారులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు. లబ్ధిదారులకు పథకం కింద రూ.1,00,116 చెక్కు అందిస్తారు. తాము అధికారంలోకి వస్తే ఈ నగదుతోపాటు తులం బంగారం అదనంగా ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. అనంతరం రాష్ట్రంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం తులం బంగారాన్ని అమల్లోకి తేలేదు. గత ఏడాది కాలంలో ఆడబిడ్డలకు పెళ్లి చేసిన తల్లిదండ్రులు మీసేవ ద్వారా కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి దరఖాస్తులు చేశారు. బంగారం ఇచ్చే కార్యక్రమం అమలు తీరుతెన్నులపై ఇంకా స్పష్టత రాలేదు. దీంతో దరఖాస్తుదారుల్లో నిరుత్సాహం నెలకొంది. మొత్తం 4,164 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 21 తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన 4143 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి రూ.41.48 లక్షల విలువైన చెక్కులు అందించాల్సి ఉంది.