A9 న్యూస్ తెలంగాణ బ్యూరో:
బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో మండిపడ్దారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో వరదలపై బీఆర్ఎస్ బురద రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే ఆమెరికాలో ఉండి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తే 20 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీ వెళ్లారు.. కానీ ప్రజలు కష్టాల్లో ఉంటే ఆ పార్టీలోని ఒక్క ఎమ్మెల్యే కూడా పరామర్శించారా అని ప్రశ్నించారు. తాను మూడు రోజులుగా నిద్రలేకుండా సమీక్ష చేస్తున్నానని.. మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని చెప్పారు. ప్రకృతి విపత్తులు వస్తే రాజకీయాలు సరికాదన్నారు సీఎం. బురద రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచించారు.
ఖమ్మంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని.. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించామని తెలిపారు. వరద నష్టంపై ప్రధాని మోదీ, అమిత్‌షా, రాహుల్ గాంధీలకి వివరించామని.. సాయం చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. వరద మృతులకు రూ.5 లక్షల పరిహారం ప్రకటించామని తెలిపారు సీఎం. ఇక వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇస్తామని ప్రకటించారు సీఎం రేవంత్. తక్షణ సాయం కింద కేంద్రం రూ.2 వేల కోట్లు ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు. ఇందుకోసం కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బాధ్యత తీసుకోవాలని తెలిపారు.