A9 న్యూస్ కామారెడ్డి జిల్లా ప్రతినిధి:
*వేసవి కాలం లో ప్రజలకు తాగునీటి సరఫరాలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి
*ఉమ్మడి జిల్లా ప్రత్యెక అధికారి శరత్
తాగునీటి సరఫరా లో ప్రజలకు ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఏ. శరత్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం తాగునీటి ఎద్దడి నివారణ పై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి మాట్లాడుతూ కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని తెలిపారు. మండల స్థాయిలో తాగునీటి ఎద్దడి నివారణకు ప్రత్యేక ఫిర్యాదుల విభాగం ఏర్పాటుచేసి వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు సత్వరమే పరిష్కారం చేయాలని సూచించారు. ప్రతి మండలానికి జిల్లా స్థాయి అధికారులను స్పెషల్ అధికారులుగా నియమించాలని తెలిపారు. మండల స్థాయి అధికారులను క్లస్టర్ అధికారులు గా నియమించి, వారం రోజులకోసారి తాగునీటి ఎద్దడి పై సమీక్ష నిర్వహించాలని చెప్పారు. కామారెడ్డి జిల్లాలో 842 ఆవాస ప్రాంతాలు ఉన్నాయని తెలిపారు. అన్ని ఆవాస ప్రాంతాలకు తాగునీరు అందే విధంగా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని కోరారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ పరిధిలో తాగు నీటి సమస్యపై సమీక్ష నిర్వహించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నీటి ఎద్దడి నివారణ పై తీసుకోవలసిన అంశాలపై చర్చించారు. అనంతరం సదాశివనగర్ మండలం మరికల్ గ్రామ శివారులోని మల్లన్న గుట్ట సమీపంలో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రాన్ని పరిశీలించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా తగు చర్యలను చేపట్టాలని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ సుజాత, మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.