నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని కప్పల వాగు, పెద్ద వాగు లను నీటితో నింపాల్సిందిగా బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులకు సూచించారు. పెద్ద వాగు, కప్పల వాగు పరివాహక ప్రాంత రైతుల కోరిక మేరకు ప్యాకేజీ 21 ద్వారా మెంట్రాజ్ పల్లి పంపు హౌస్ నుండి పెద్ద వాగులోని చింతలూర్ అవుట్ లెట్, కప్పల వాగు లోని బడా భీంగల్ అవుట్ లెట్ పాయింట్ల నుండి పెద్ద వాగు, కప్పల వాగు ల్లోకి నీటిని వదలాలని సీఈ మధుసూదన్, ఈఈ భాను ప్రకాష్ లతో ఫోన్ లో మాట్లాడి సూచించారు. సోమవారం ఎమ్మెల్యే భీంగల్ మండలం లో పర్యటించారు. ఈ సందర్బంగా అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. కప్పల, పెద్ద వాగులలో 300 క్యూసెక్కుల చొప్పున నీటిని నింపడం ద్వారా వాగులకు ఇరువైపులా ఉన్న బోర్లలో నీటి మట్టం పెరిగి రైతులకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. వెంటనే నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని సూచించారు. అధికారులకు లేఖ కూడ రాసారు.