హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఆరు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆదివారాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని, ఏప్రిల్ 7 నుంచి 12 వరకూ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఈనెల 7, 8 తేదీల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తుపాన్ వచ్చే అవకాశం ఉందని, అలాగే గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అలాగే 8, 9 తేదీల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన తుపాన్ వచ్చే ప్రమాదం ఉందని, ఆయా తేదీల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ప్రమాదం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
ఈ తేదీల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్, సంగారెడ్డి, మహబాబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చిరించింది. అలాగే ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకూ రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కావున, ఆయా జిల్లాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు ఏప్రిల్ 7 నుంచి 12 వరకూ జాగ్రత్తగా ఉండాలి..