KTR | హైదరాబాద్ నగరం, విశ్వవిద్యాలయ భవిష్యత్‌ కోసం హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ విద్యార్థులు పడుతున్న ఆరాటం చాలా గొప్పదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపైన ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతుందని కేటీఆర్ మండిపడ్డారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కేటీఆర్‌ తెలంగాణ భవన్‌లో కలిశారు. వారి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంఆ ఆయన మాట్లాడుతూ.. ‘తొలి దశ తెలంగాణ ఉద్యమం తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కాలక్రమంలో అనేక పేరు ప్రఖ్యాతలు సాధించుకుంది. అక్కడ చదివిన విద్యార్థులు దేశ విదేశాల్లో గొప్ప సేవ చేస్తున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దేశానికి తలమానికంగా ఉన్న విద్యాసంస్థల్లో ఒకటిగా ఉన్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఎలాంటి స్వార్థం లేకుండా సమాజ హితం కోసం చేస్తున్న గొప్ప పోరాటం ఇది . హైదరాబాద్ నగర భవిష్యత్తు కోసం విశ్వవిద్యాలయ భవిష్యత్తు కోసం పడుతున్న ఆరాటం చాలా గొప్పది’ అన్నారు.

*హెచ్‌సీయూ విద్యార్థులకు సెల్యూట్‌ చేస్తున్నాం.

‘ఈ మధ్య కొత్తతరం పిల్లల్లో విద్యార్థుల్లో పోరాట స్ఫూర్తి తగ్గిందని అప్పుడప్పుడు బాధపడతాం. కానీ, ఇలాంటి సరైన సందర్భంలో యూనివర్సిటీ విద్యార్థులు చూపెడుతున్న తెగువ, వారి పోరాటానికి సెల్యూట్ చేస్తున్నాం. ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలను విద్యార్థుల తరఫున పార్టీ తరఫున అడుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం యూనివర్సిటీ విద్యార్థులపైన, యూనివర్సిటీ భూములపైన రాజకీయం చేస్తున్నది? వందల బుల్డోజర్లను, హిటాచి యంత్రాలను పెట్టి అక్కడున్న చెట్లను, జంతువులను, చంపి మరీ వేగంగా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నది? ఎందుకు ఇంత వేగంగా భూముల కబ్జాకు ఆరాటపడుతున్నదో చెప్పాలి ? అంటూ డిమాండ్‌ చేశారు. గచ్చిబౌలి నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో నగరం విస్తృతంగా పెరిగింది. ఒక కాంక్రీట్ జంగల్‌గా మారింది. భారత దేశంలోని ఏ నగరంలో అంత తక్కువ విస్తీర్ణంలో భారీగా నగరం అభివృద్ధి చెందలేదు. కోట్లాది చదరపు అడుగుల నివాస గృహాలు నిర్మాణం అవుతున్నాయి. పశ్చిమ హైదరాబాద్‌కి ఊపిరినిచ్చే కొన్ని గ్రీన్ ప్రాంతాలలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, దాని చుట్టూ ఉన్న ప్రాంతాలే. పశ్చిమ హైదరాబాద్‌లో భవిష్యత్తులో ఢిల్లీ మాదిరి ఊపిరి పీల్చుకోవడమే కష్టం అయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

*_భవిష్యత్‌కు కొత్త భరోసా_*

‘సెంట్రల్ యూనివర్సిటీ చుట్టూ ఉన్న హరితాన్ని అలాగే ఉంచితే భవిష్యత్తుకు కొంత భరోసా ఉంటుంది. ఒక ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది చేయకుండా ఏ విధంగా ఈ 400 ఎకరాలు అమ్ముతారని విద్యార్థులు అడుగుతున్నారు. ఈ 400 ఎకరాలను అమ్మేముందు జరిగే పర్యావరణ నష్టం ప్రభావంపై అధ్యయనం చేయాలి అని అడుగుతున్నారు. 2003లో ఐఎంజీ భారత అనే కంపెనీకి క్రీడా సదుపాయాల కోసం ఈ 400 ఎకరాలను కేటాయించింది. కేవలం స్టేడియాలు క్రీడా శిక్షణకు సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వాలు భూములను ఆ సంస్థకు ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం అదే ప్రాంతంలో 400 ఎకరాలలో కోట్లాది చదరపు అడుగుల నిర్మాణాలు చేపట్టి కాంక్రీట్ జంగల్‌గా మార్చే ప్రయత్నం చేస్తున్నది.

 

21 సంవత్సరాల తర్వాత కేసు తేలింది. కానీ, ప్రభుత్వం మాత్రం వెంటనే ఆ భూములను అమ్మి రూ.30వేలకోట్లు సేకరించాలని ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి ఆస్తులు అమ్మడం, అప్పులు తేవడం అనే ఎజెండాను ప్రజలు నిర్ణయిస్తారు. ఫ్యూచర్ సిటీ 50 వేల ఎకరాలలో కడతామని చెప్పి ప్రచారం చేసుకుంటున్నారు. ఫార్మాసిటీ భూములతో పాటు మరో 30 వేల ఎకరాలు సేకరించి నూతన నగరం కడతామంటున్నారు. ఇప్పటికే వేల ఎకరాల భూమి మీకు అందుబాటులో ఉన్నప్పుడు 45 వేల ఎకరాలను అమ్ముకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. 45వేల ఎకరాలు ప్రభుత్వానికి అందుబాటులో వచ్చే ఈ తరుణంలో 400 ఎకరాలపైన ఎందుకు ఇంత దారుణంగా దాష్టీకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అంటూ డిమాండ్‌ చేశారు. అడ్డమొచ్చిన విద్యార్థులను ఆడబిడ్డలను లాగి పడేసి దుస్తులను చించి మరీ దుశ్శాసశానుడి మాదిరి వ్యవహరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగబడుతున్నది అంటూ ధ్వజమెత్తారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *