ఏప్రిల్ 27వ తేదీన బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించడానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 27వ తేదీన హన్మకొండ జిల్లాలోని ఎల్కతుర్తి లో పార్టీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు సన్నాహాలు మొదలుపెట్టారు.
ఇక్కడ భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు.
భారీ బహిరంగ సభకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్
భారీ బహిరంగ సభ నిర్వహించి కొత్త ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లాలని గులాబీ అధినేత కెసిఆర్ నిర్ణయించిన క్రమంలో భారీ బహిరంగ సభకు ఇప్పటి నుంచే ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. మొత్తం సభకు ఇతర అవసరాలకు దాదాపు 1200 ఎకరాల వరకు అవసరమని అంచనా వేస్తున్న బీఆర్ఎస్ పార్టీ నేతలు రూట్ మ్యాప్ తో పాటు సభ నిర్వహణ స్థలాన్ని ఇటీవల పరిశీలించారు.
పది లక్షల జన సమీకరణ లక్ష్యం
బీఆర్ఎస్ పార్టీ నేతలు పెద్ది సుదర్శన్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, వొడితెల సతీష్ బాబు తదితరులు ఇప్పటికే సభా స్థలాన్ని పరిశీలించారు. అధినేత ఆదేశాలతో జన సమీకరణ పైన దృష్టి పెట్టిన నేతలు దాదాపు పది లక్షల మంది జనాభాను సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు .
బహిరంగ సభతో సత్తా చాటాలనే ప్లాన్
ఈ రజతోత్సవ సభతో పార్టీ సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్న గులాబీ నేతలు రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఈ సభకు జన సేకరణతో పాటు సభకు వచ్చే వారికి అందుకు తగ్గట్టు ఏర్పాట్లు కల్పించడానికి సిద్ధమవుతున్నారు. చింతలపల్లి, దామెర శివారులోని స్థలాన్ని బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే అక్కడ కొంతమంది రైతులతో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కూడా తీసుకున్నారు.
ట్రాఫిక్ ప్రాబ్లమ్ లేకుండా రూట్ మ్యాప్ , ఏర్పాట్లు
సభకు తరలి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ సమస్య చోటు చేసుకోకుండా రూట్ మ్యాప్ ను సైతం సిద్ధం చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలు 40 నుంచి 50 వేల వరకు వస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టు ఏర్పాట్లు చేయడం పైన ఫోకస్ చేశారు. ఎక్కడికక్కడ నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేసి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సభకు వచ్చే జనాల కోసం పదిలక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సరఫరా చేయాలని నిర్ణయించారు.