హైదరాబాద్, మార్చి 22: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పార్టీ నేతలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ రాష్ట్రానికి కొత్త బీజేపీ అధ్యక్షుడు వస్తున్నారని.. కానీ ఆ అధ్యక్షుడిని ఎవరి ఫైనల్ చేస్తున్నారని ప్రశ్నించారు. స్టేట్ కమిటీనా లేక సెంటర్ కమిటీనా అని అడిగారు. ఒకవేళ స్టేట్ కమిటీ అధ్యక్షుడిని డిసైడ్ చేస్తే ఆ అధ్యక్షుడు రబ్బర్ స్టాంప్ గానే ఉంటాడంటూ సంచలన కామెంట్స్ చేవారు. ఒకవేళ సెంటర్ కమిటీ అధ్యక్షుని డిసైడ్ చేస్తే చాలా మంచిదని అభిప్రాయపడ్డారు. గతంలో ఉన్న అధ్యక్షులు వారి వారి గ్రూప్‌లను ఏర్పాటు చేసుకుని పార్టీకి నష్టం కలిగించారంటూ వ్యాఖ్యలు చేశారు. సీనియర్ బీజేపీ నేతలు, కార్యకర్తల కోసం జైలుకెళ్లిన వారిని కూడా పక్కన పెట్టేశారన్నారు.
కొత్త బీజేపీ అధ్యక్షులు వస్తే అదే గ్రూపిజం చేస్తే పార్టీకి నష్టం కలగడం ఖాయమన్నారు. బీజేపీలో కొందరు నేతలు, ఎమ్మెల్యేల, ఎంపీల చేతులు కట్టేసి పక్కన పెట్టేయడం వల్లే ఇప్పుడీ పరిస్థితి వచ్చిందన్నారు. అలా కాకుండా బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీలను ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణకు బీజేపీ కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రితో రహస్య సమావేశాలు పెట్టకూడదన్నారు. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని.. ధర్మం గురించి పనిచేసే కార్యకర్తలను గుర్తించాలన్నారు. సీనియర్ అధికారులు, కార్యకర్తలను తొక్కేయడాన్ని గతంలో చూశామన్నారు. కొత్త బీజేపీ అధ్యక్షులు అలాంటివి జరుగకుండా చూడాలన్నారు.
‘నేను చెప్పే మాటలు ఎవరికీ నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదని.. సీనియర్ నేతలు, కార్యకర్తల మనసులో ఉన్న మాటలను బయటపెడుతున్నా. అనవసరంగా మీడియాకు మెసేజ్‌లు ఇస్తున్నారు.. కొందరు నాపై అంటున్నారు. ఏదైనా ఉంటే పార్టీ నాయకులకు చెప్పాలి. మీడియాకు చెప్పుకూడదని అంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి ఎప్పుడో తీసుకెళ్లాను. వారు వినకపోవడం వల్లే ప్రజల ముందుకు పెడుతున్నాను’ అని రాజాసింగ్ స్పష్టం చేశారు..