శ్రీ సత్య నారాయణ స్వామి అన్నవరంలో మంగళవారం నుంచీ కొత్త నిబంధన
రేపటి నుంచి కొండపై దుకాణాల్లో ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ప్రకటన
గాజు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీరు
విక్రయించేందుకు మాత్రమే అనుమతి
కొండపై జరిగే వివాహాలకూ నిబంధన వర్తింపు
మూత తీయని కూల్ డ్రింక్స్ మాత్రమే కొండపైకి అనుమతి
నిబంధనలు పక్కాగా అమలయ్యేలా తనిఖీలు చేసేందుకు నిర్ణయం
పర్యావరణ పరిరక్షణ కోసం కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానం కొత్త నిబంధన అమలు చేయనుంది. మంగళవారం నుంచి కొండపై ప్లాస్టిక్‌ను నిషేధిస్తున్నట్టు ఆలయ ఈవో ఆజాద్ తెలిపారు. అక్కడి దుకాణాల్లో కేవలం గాజు సీసాలు, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో మాత్రమే నీటిని విక్రయిస్తారని చెప్పారు. 750 ఎమ్ఎల్ గాజు సీసాల్లో నీటికి రూ.60, మొక్కజొన్న గింజలతో చేసిన సీసాల్లో నీటికి రూ.40 రేటు ఖరారు చేసినట్టు వివరించారు. గాజు సీసా తిరిగిచ్చేవారు రూ.40 వెనక్కు తీసుకోవచ్చని వెల్లడించారు.
మూత తెరవని కూల్ డ్రింక్స్ ను(మంచినీళ్లు మినహా) మాత్రమే కొండపైకి అనుమతిస్తామని పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలు పాటించేలా తనిఖీలు కూడా చేస్తామని పేర్కొన్నారు. కొండపై జరిగే వివాహాలకూ ఈ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. వీటిని అతిక్రమించిన వారిపై రూ.500 జరిమానా విధిస్తామని, ఆలయ సిబ్బంది అంతా ఈ రూల్స్ పాటించాలని ఈవో ఆదేశాలు జారీ చేశారు.