A9 న్యూస్ ప్రతినిధి హైదరాబాద్, మార్చి 21:
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి. విద్యార్థులంతా అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. మొత్తం 5,09,403 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. వారిలో 2,58,895 మంది బాలురు, 2,50,508 మంది బాలికలు ఉన్నారు. ఉదయం 9:30 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఐదు నిమిషాలు ఆలస్యమైనా పరీక్షకు అనుమతిస్తామని అధికారులు తెలిపారు. టెన్త్ పరీక్షల కోసం 2,650 కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 28,100 మంది ఇన్విజిలేటర్లు, 2,650 మంది చీఫ్ సూపరింటెండెంట్‌లు, 2,650 మంది శాఖ అధికారులను నియమించారు.
విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అలాగే 24 గంటలూ పని చేసే కంట్రోల్ రూమ్‌లు కూడా అధికారులు ఏర్పాటు చేశారు. పరీక్షల సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తినా, విద్యార్థుల విజ్ఞప్తులను 040-23230942 నెంబర్‌కు కాల్ చేసి అడగవచ్చని అధికారులు తెలియజేశారు. ఈ ఏడాది తొలిసారి 24 పేజీల బుక్ లెట్‌ను విద్యార్థులకు ఇవ్వనున్నారు. ఎలాంటి అడిషనల్ పేజీలు ఇవ్వబోమని అధికారులు వెల్లడించారు.