కొమురవెల్లి మల్లన్న ‘పట్నంవారం’*  

– *హైదరాబాద్ నుంచి తరలివెళ్లనున్న వేలాదిమంది భక్తులు*

 

– *భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు*

 

కొమురవెల్లి క్షేత్రం పట్నంవారానికి సిద్ధమైంది. మల్లన్న బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌కు చెందిన వేలాదిమంది భక్తులు తరలివెళ్లనున్నారు. లక్షలాది మంది తరలివచ్చే మహాజాతర ప్రారంభానికి ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.

 

పట్నంవారం అంటే..

 

సంక్రాంతి పర్వదినం తర్వాత వచ్చే మొదటి ఆదివారాన్ని పట్నంవారంగా పిలుస్తారు. మల్లన్న యాదవుల ఆడబిడ్డ అయిన మేడలాదేవిని వివాహమాడిన నేపథ్యంలో యాదవులకు ఈవారం అత్యంత ప్రీతికరం.

 

హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు శనివారం ఇంటిల్లిపాదిగా అక్కడకు చేరుకుంటారు. కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోకుండానే స్వామివారిని నేరుగా ధూళి దర్శనం చేసుకుంటారు. ఆదివారం తెల్లవారుజామునే తలనీలాలు సమర్పించి పుణ్యస్నానమాచరిస్తారు. బోనం తయారుచేయడానికి స్థానికంగానే కూరగాయలు, మట్టికుండలు కొనుగోలు చేస్తారు.

 

మల్లన్నకు బెల్లంపాయసంతో బోనం తయారుచేసి పట్నంవేసి సహంఫక్తి భోజనం చేస్తారు. స్వామివారిని దర్శించుకుని ఒడిబియ్యాం సమర్పిస్తారు. అలాగే స్వామివారి తోబుట్టువు అయిన ఎల్లమ్మకు బోనాలు నివేదిస్తారు. మరుసటి రోజైన సోమవారం హైదరాబాద్‌కు చెందిన యాదవ పూజారుల సంఘం ఆధ్యర్యంలో పెద్దపట్నం వేసి అగ్నిగుండాలను దాటుతారు. తరువాత వచ్చే ఆదివారాన్ని లష్కర్‌ వారంగా పిలుస్తారు..

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *