హైదరాబాద్: గాంధీ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గాంధీ భవన్ ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు పెద్దఎత్తున రావడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీపై ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ యూత్ కాంగ్రెస్ నేతలు ముందుగా.. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం బీజేపీ కార్యాలయం వద్దకు చేరుకున్న పోలీసులు వారిని అక్కడ్నుంచి పంపించారు. అయితే ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, నాయకులు గాంధీ భవన్‌ను ముట్టడించేందుకు యత్నించారు. పెద్దఎత్తున గాంధీ భవన్ వద్దకు చేరుకున్న కాషాయం కార్యకర్తలు అక్కడ ఉన్న ఫ్లెక్సీలను చింపివేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇరువర్గాల మధ్య పెద్దఎత్తున ఘర్షణ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బీజేపీ శ్రేణులను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేశారు..