నూతన ఆర్థిక విధానాల మీద అభిప్రాయాలు, దృక్పథాలు ఎట్లా ఉంటాయన్నదాన్ని బట్టి మన్మోహన్‌సింగ్ మీద అంచనాలు ఉంటాయి. ఈ దేశానికి అత్యవసరమైన సమయంలో అత్యంత నిర్ణయాత్మక పాత్ర పోషించారని చాలా మంది ఆయనను కీర్తిస్తారు. పదేళ్లు ప్రధానిగా కంటె, పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థికమంత్రిగా ఆయన పాత్ర గొప్పదని భావిస్తారు.
సంస్కరణల ఫలితాలు తాము ఆశించినట్టుగా లేవని పీవీ తో పాటు, మన్మోహన్ సింగ్ కూడా అనేకమార్లు ఆత్మవిమర్శ లాంటిదేదో వ్యక్తం చేశారు. ఇవాళ చూస్తున్న జుగుప్సాకరమైన సంపద కేంద్రీకరణ, నిస్సిగ్గు ఆశ్రిత కార్పొరేటిజం, వ్యవసాయ, పారిశ్రామిక సంక్షోభాలు ముప్పై మూడేళ్ల కిందట మొదలైన సంస్కరణల పర్యవసానాలే. దేశంలో ఇప్పుడు దృశ్యమానంగా ఉన్న నిట్టనిలువు అభివృద్ధి, రోడ్లు, రేవులు, విమానాశ్రయాలు, కమ్యూనికేషన్లు, విలాస జీవనావకాశాలు కూడా ఈ కాలపు మహిమలేనని ఒప్పుకోవాలి.
అస్వతంత్ర ప్రధాని అని పేరు తెచ్చుకున్నా, తన విధానాల విషయంలో కఠినంగానూ నిక్కచ్చిగానూ ఉన్న వ్యక్తి మన్మోహన్ సింగ్. అంతే కాదు, విద్యాధికుడిగా, ఆర్థిక రంగ నిపుణుడిగా, గంభీరుడిగా ఆయన ప్రధాని పదవికి ఉండవలసిన గౌరవాన్ని కొనసాగించారు. మతతత్వ వ్యతిరేకత, సహజీవన సంస్కృతి వంటి జాతీయోద్యమ విలువల విషయంలో ఆయన ఆధునిక ఉదార, లౌకిక వాదిగా కొనసాగారు. ప్రధానిగా ఆయన రెండో దఫా పాలనలో ప్రభుత్వం బలహీనపడి, సంకీర్ణ భాగస్వాముల మధ్య సమన్వయరాహిత్యం పెరిగి, ఎవరికివారు స్వలాభంలో స్వార్జన లో మునిగిపోవడంతో, విమర్శకులు ఆరోపించినట్టు, విధాన, పాలనా వైకల్యాలు ముదిరిపోయాయి. 2014 లో బిజెపి ఘనవిజయం సాధించడానికి మన్మోహన్ వైఫల్యాలే కారణం.
మన్మోహన్ ను కూడా అభ్యుదయ, సమన్యాయవాదిగా కూడా పరిగణించవలసిన ఒకానొక సందర్భాన్ని ఇటీవలి ఎన్నికలకు ముందు చెలరేగిన వివాదం తీసుకువచ్చింది. సంక్షేమ వనరులను అందుకునే మొదటి హక్కు మైనారిటీలదే- అని మన్మోహన్ 2006 లో అన్నారని, మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లిములకు దోచిపెట్టడమే కాంగ్రెస్ విధానమనడానికి అదే రుజువని బిజెపి గట్టి ప్రచారం చేసింది. తన మాటల వక్రీకరణ మీద మన్మోహన్ వెనువెంటనే ఖండన, వివరణ ఇచ్చారు. ఆయన ఆనాడు అన్న మాటలను మరోసారి గుర్తు చేసుకోవడం ఈ సందర్భంగా న్యాయం. డిసెంబర్ 9, 2006 నాడు జాతీయాభివృద్ధి మండలి సమావేశంలో మాట్లాడుతూ,మన్మోహన్ సింగ్ ఇట్లా అన్నారు. ‘’మన సమష్టి ప్రాధాన్యాలు స్పష్టంగా ఉన్నాయని అనుకుంటున్నాను: వ్యవసాయం, సాగునీరు, జలవనరులు, ఆరోగ్యం, విద్య, గ్రామీణ మౌలిక సదుపాయాలలో ఆవశ్యకమైన పెట్టుబడి, మొత్తంగా మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రభుత్వ కేటాయింపులు, వీటన్నిటితో పాటు, ఎస్ సి, ఎస్ టి, ఓబిసి, మైనారిటీలు,మహిళలు, పిల్లల అభ్యున్నతి కోసం కార్యక్రమాలు, ఇవీ ఆ ప్రాధాన్యాలు. ఎస్‌సి, ఎస్ టి ల వాటా ప్రణాళికలను పునరుజ్జీవింపజేయాలి. మైనారిటీలు, ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు అభివృద్ధి ఫలాలలో న్యాయమైన భాగం పొందడానికి కొత్తరకం పథకాలు రచించాలి. ఈ శ్రేణులకు, కార్యక్రమాలకు వనరుల మీద మొదటి హక్కు ఉండాలి. కేంద్రప్రభుత్వానికి ఇంకా అసంఖ్యాకమైన ఇతర బాధ్యతలున్నాయి, వాటన్నిటిని అందుబాటులోని వనరులలో సర్దుబాటు చేయాలి.’’
ప్రాధాన్య రంగాలకు, అభ్యున్నతి అవసరమైన శ్రేణులకు వనరులలో మీద మొదటి హక్కు ఉండాలని చెప్పినదాన్ని, ముస్లిం మైనారిటీలకు పెద్ద పేట వేయాలని మన్మోహన్ అన్నట్టుగా అన్వయించారు. మొదటి హక్కు పొందవలసినవారిలో ముస్లిములు, ఇతర మైనారిటీలు కూడా ఉన్నారు, కానీ, వారు మాత్రమే లేరు.
ఈ పదేళ్ల కాలం అనేక గతకాలాల మీద అభిప్రాయాలను, అంచనాలను సవరించింది. ఆ రోజులే బాగున్నాయేమోనన్న సాపేక్ష భావనలను కలిగించింది. అనేక విమర్శలున్న పాత నేతలలో మంచిని వెదికేట్టు చేసింది. అభివృద్ధి ఫలితాలు, ప్రజా వనరులు కంపెనీలకు, సంపన్నులకు చెందే విధానాలు రూపొందించారన్న విమర్శలు, ప్రశంసలు పొందిన మన్మోహన్ సింగ్, ప్రభుత్వ కేటాయింపుల్లో, సంక్షేమ వనరుల్లో మొదటి ముద్ద బాధిత శ్రేణులకు చెందాలని అన్న పాపానికి తీవ్రమైన దాడి ఎదుర్కొన్నారు!