ఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, మల్లు రవి మండిపడ్డారు. పార్లమెంట్ నడిపిన తీరు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఎంపీలు ధ్వజమెత్తారు. చర్చలు లేకుండానే పార్లమెంట్ సమావేశాలు ముగించారంటూ మండిపడ్డారు. అంబేడ్కర్ పేరు ఉచ్ఛరించడమే తప్పన్నట్లుగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కుట్రలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్డీయే ఎంపీలు ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహించారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల కిరణ్ కుమార్ మాట్లాడుతూ..”ఎన్డీయే ప్రభుత్వం చర్చలు లేకుండా శీతాకాల సమావేశాలను ముగించింది. పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, సంబల్, మణిపూర్ సహా ప్రజా సమస్యలపై చర్చ జరపాలని మేము డిమాండ్ చేస్తే కేంద్రం పట్టించుకోలేదు. అంబేడ్కర్ పేరు ప్రస్తావించడమే తప్పన్నట్లుగా అమిత్ షా మాట్లాడి దేశ ప్రజల మనోభావాలు దెబ్బతీశారు. ఆయన మాటలను ఎడిటింగ్ చేశామని మా మీదే నిందలు వేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. నిన్న (గురువారం) ఎన్డీయే ఎంపీలపై దాడికి పాల్పడి ఆ దాడి ఘటనను రాహుల్ గాంధీ మీద నెట్టే కుట్ర చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని సైతం మార్చే కుట్ర పన్నింది. అది నిజమే అన్నట్లు బీజేపీ వ్యవహారశైలి ఉంది. వారికి 400 సీట్లు వచ్చి ఉంటే కొత్త రాజ్యాంగాన్ని తెచ్చేవారు. 2/3 మెజారిటీ లేనిదే జమిలి బిల్లు పాస్ కాదని తెలిసినా చిత్తశుద్ధి లేకుండా తూతూ మంత్రంగా బిల్లు ప్రవేశపెట్టి చేతులు దులుపుకున్నారని” అన్నారు.
మరో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. “బీజేపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. అదానీపై పెద్దఎత్తున్న అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని కాంగ్రెస్, ఇండియా కూటమి పట్టు పట్టింది. కానీ స్పీకర్, ప్యానెల్ స్పీకర్ మాత్రం వారికి కావాల్సిన బిల్లులను పాస్ చేశారు. బీజేపీ వాళ్లకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే విధానం తెలియదు. పార్లమెంట్ నడపాలనే ఆలోచనా లేదు. అదానీని రక్షించేందుకు భారత రాజ్యాంగం ఉందన్నట్లు బీజేపీ వ్యవహరించింది. శుభాషితాలు చెప్పడం తప్ప సభను నడిపేందుకు స్పీకర్ చేసిందేమీ లేదు. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరైనవి కావు. దీనికి ఆయన వెంటనే రాజీనామా చేయాలి. అంబేడ్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని” అన్నారు.. *KP*