*యాదాద్రి జిల్లా లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఘటన*

 

వలిగొండ: ఇద్దరు బాలికలను ప్రిన్సిపల్‌ విచక్షణారహితంగా కొట్టిన ఘటన యాదాద్రి-భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని లోతుకుంట ఆదర్శ పాఠశాలలో మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్షిత, అఖిల లోతుకుంట ఆదర్శ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నారు. ఈ నెల 12న ఉదయం వారు జావ తాగుతుండగా ఎంత సేపు తాగుతారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రిన్సిపల్‌ రహిసున్నిసా బేగం విద్యార్థినులను పైపుతో కొట్టారు. దీంతో భయపడిన బాలికలు గాయాల గురించి తల్లిదండ్రులకు చెప్పకుండా మరుసటి రోజు యథావిధిగా పాఠశాలకు వచ్చారు. వారిని పిలిచి ఎలా ఉందని అడిగిన ప్రిన్సిపల్‌ ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇద్దరికీ ఫ్రాక్చర్‌ అయినట్లు గుర్తించి బ్యాండేజ్‌ వేయించారు. తర్వాత రెండ్రోజులు సెలవులు కావడంతో విషయం బయటకు రాలేదు. సోమవారం తల్లిదండ్రులు ప్రిన్సిపల్‌ వద్దకెళ్లి నిలదీశారు. ‘క్షమించండి, మరోసారి ఇలాంటి పొరపాటు చేయను వదిలేయండి.. ఆసుపత్రి ఖర్చులు భరిస్తా’అని ప్రిన్సిపల్‌ సమాధానం చెప్పినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. దీనిపై ప్రిన్సిపల్‌ రహిసున్నిసా బేగంను వివరణ కోరగా.. క్రమశిక్షణ పాటించాలని నెమ్మదిగానే కొట్టానని చెప్పారు. వాలీబాల్‌ ఆడుతుంటే చేయికి దెబ్బతగిలితే కట్లు కట్టించామని తెలిపారు. మంగళవారం ఎంఈవో భాస్కర్‌ పాఠశాలకు వెళ్లారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి జిల్లా విద్యాధికారికి నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు.

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *