A9 న్యూస్ జక్రాన్‌పల్లి:
జక్రాన్‌పల్లి మండల కేంద్రంలోని 108 అంబులెన్స్‌ను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లో అందుబాటులో ఉన్న అత్యవసర మందులు, వైద్య పరికరాలు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర ఎమర్జెన్సీ సామగ్రిని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ సేవలకు సంబంధించిన రిజిస్టర్లు, నిర్వహణ రికార్డులను పరిశీలించి వాటి నిర్వహణపై సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా అంబులెన్స్ సిబ్బంది ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సూచించారు. మందుల నిల్వలు, పరికరాల పనితీరును కూడా పరిశీలించి తగిన సూచనలు చేశారు. ఈ తనిఖీ సందర్భంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ అకేష్, అంబులెన్స్ పైలెట్ జె. కిషన్ విధుల్లో పాల్గొని వాహనానికి సంబంధించిన వివరాలను డీఎంహెచ్‌ఓకు వివరించారు.








