మృతుడి గుర్తింపునకు పోలీసుల ప్రయత్నాలు కొనసాగింపు….
A9 న్యూస్ ఆర్మూర్:
ఆలూరు మండల కేంద్ర శివారులో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ గుర్తుతెలియని యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలూరు నుంచి దేగాం–నందిపేట్ రహదారి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువకుడు, నందిపేట్ నుంచి ఆర్మూర్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా ఢీకొన్నాడు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఆర్మూర్ పోలీసులు, ఎస్సై యాసీర్ అర్ఫాత్ ఆధ్వర్యంలో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో, మృతుడు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ కలిగిన ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్నట్లు గుర్తించారు. తెల్ల చొక్కా, తెల్ల ప్యాంటు ధరించిన అతని వయస్సు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆర్మూర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, మృతుడి గుర్తింపు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.








