A9 న్యూస్ ఆర్మూర్:
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా ఆర్‌ఐ, జీపీఓ ఆర్మూర్ అధికారులు మున్సిపల్ సిబ్బందితో కలిసి ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిరాయితి నగర్, కెనాల్ కట్ట, మామిడిపల్లి రైల్వే వంతెన ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. వర్షపు నీరు నిల్వ ఉండే ప్రాంతాలను గుర్తించి, నీటి పారుదల సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా లోతట్టు ప్రాంతాల్లో సంచరించవద్దని, వాగులు, కాలువలు, రైల్వే వంతెనల సమీపంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని అధికారులు కోరారు.








