ఏకలవ్య పాఠశాలలో తీవ్ర నీటి కొరత.. విద్యార్థులు నరకయాతన….

On: Sunday, June 28, 2026 8:31 AM

 

మూడు–నాలుగు రోజులకోసారి మాత్రమే స్నానాలు.. నిర్మాణ పనులకు తాగునీటిని వాడుతున్నారంటూ విద్యార్థుల ఆవేదన

నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని గంగారం తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో తీవ్ర నీటి కొరత నెలకొంది. వందలాది మంది విద్యార్థులు నివసిస్తున్న ఈ వసతి గృహంలో కనీస అవసరాలకు కూడా నీరు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

విద్యార్థుల కథనం ప్రకారం, ప్రతిరోజూ ఉదయం బాత్రూమ్‌లలో నీరు లేకపోవడంతో మూడు, నాలుగు రోజులకోసారి మాత్రమే స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాలకు మిషన్ భగీరథ ద్వారా రోజుకు సుమారు 40 వేల లీటర్ల నీరు సరఫరా అవుతున్నప్పటికీ, అది విద్యార్థుల అవసరాలకు సరిపోవడం లేదని చెబుతున్నారు. ఇదే సమయంలో పాఠశాలలో జరుగుతున్న నూతన నిర్మాణ పనులకు వాటర్ క్యూరింగ్ కోసం కూడా మిషన్ భగీరథ తాగునీటినే వినియోగిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

త్రాగడానికి, స్నానాలకు సరిపడా నీరు లేక ఇబ్బందులు పడుతుంటే నిర్మాణ పనులకు తాగునీటిని వినియోగించడం సమంజసం కాదని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.

ఏకలవ్య పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యపై ఉన్నతాధికారులు, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ తాగునీటిని నిర్మాణ పనులకు వినియోగించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

28 Jun 2026

Leave a Comment