కొత్తగా ఏర్పడిన డొంకేశ్వర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గంగుల బాపూరావు నియమితులయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు ఉన్న రాజకీయ, సామాజిక అనుభవాన్ని గుర్తించి ఈ బాధ్యతలను అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ సందర్భంగా గంగుల బాపూరావు మాట్లాడుతూ, డొంకేశ్వర్ మండల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. మండలంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల వంటి పథకాల ప్రయోజనాలు అందేలా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.
గత 25 సంవత్సరాలుగా వివిధ రాజకీయ, సామాజిక పదవుల్లో సేవలందించిన బాపూరావుకు కాంగ్రెస్ పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన నిజామాబాద్ జిల్లా యాదవ సంఘం కన్వీనర్‌గా, యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.
అలాగే గతంలో డొంకేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ చైర్మన్‌గా పనిచేసిన సమయంలో అన్నారం, సిర్పూర్, డొంకేశ్వర్, నూత్ పల్లి,గ్రామాల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. లిఫ్ట్ ఇరిగేషన్ వ్యవస్థ అభివృద్ధికి సుమారు రూ.2.35 కోట్ల నిధులు సమకూర్చి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు స్థానిక రైతులు గుర్తు చేసుకుంటున్నారు.
ఇక గతంలో యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన బాపూరావు, పార్టీ కోసం కష్టపడిన నాయకుడిగా గుర్తింపు పొందారు. కొత్తగా ఏర్పడిన డొంకేశ్వర్ మండలంలో అనుభవజ్ఞుడైన నాయకుడిని అధ్యక్షుడిగా నియమించడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు.
“కార్యకర్తలే పార్టీకి వెన్నెముక. అందరినీ కలుపుకొని డొంకేశ్వర్ మండలంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తాను” అని గంగుల బాపూరావు అన్నారు.








