నందిపేట్, సెప్టెంబర్ 16,
నందిపేట్ మండలం చింరాజ్‌పల్లి శివారులో ప్రభుత్వ భూములపై అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతోంది.
స్థానిక సమాచారం ప్రకారం, చింరాజ్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 40/7/28లో రెండు ఎకరాలు 20 గుంటల భూమి ప్రభుత్వానికి చెందినదే. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన ఈ భూమిని ఒక మాజీ ప్రభుత్వ ఉద్యోగి తన ప్రభావాన్ని వినియోగించి, పత్రాల్లో లోపాలు సృష్టించి అక్రమంగా కొనుగోలు చేసినట్టు బయటపడింది.
ఇక, ఈ భూమిని డికంపల్లి మోహన్ పేరుతో రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా, వెంచర్ కోసం ప్లాట్లు సిద్ధం చేసి ముందుగానే కొన్ని గజాలు అమ్మినట్లు కూడా సమాచారం. ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజలందరికీ సొమ్ము అయిన ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వంతం చేసుకోవడం పెద్ద నేరమని స్థానికులు విమర్శించారు. “ప్రభుత్వానికి చెందిన ఆస్తులను రక్షించి ప్రజల అవసరాలకు వినియోగించాల్సిన బదులు, అక్రమంగా రిజిస్టర్ చేసుకోవడం తీవ్రంగా ఖండించదగిన చర్య” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్ రద్దు చేయడమే కాకుండా, సంబంధిత మాజీ ఉద్యోగి మరియు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.
ప్రభుత్వ భూములను అక్రమంగా స్వాధీనం చేసుకోవడాన్ని అంగీకరించేది లేదని, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు








