*నీటమునిగిన కార్యాలయం – తప్పిద నిర్మాణంపై స్థానికుల ప్రశ్నలు..
*వాగు ఒడ్డున నిర్మాణం మూలమేనా భీమ్‌గల్ ప్రమాదం..?
A9 న్యూస్ డెస్క్:
భారీ వర్షాల కారణంగా కప్పల వాగు ఉధృతి పెరగడంతో భీమ్‌గల్ ఎక్సైజ్ కార్యాలయం నీటమునిగింది. ఆకస్మికంగా వాగు నీరు కార్యాలయంలోకి చేరడంతో సిబ్బంది గంగాధర్, సికిందర్ లోపలే చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ప్రారంభమైనప్పటికీ, ఈ ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది.
గ్రామ ప్రజల అభిప్రాయం ప్రకారం, ఎక్సైజ్ కార్యాలయాన్ని వాగు పక్కనే నిర్మించడమే ఈ సమస్యకు కారణమని చెబుతున్నారు. వర్షాకాలంలో వాగు పొంగిపొర్లే అవకాశం ఉన్నప్పటికీ, కార్యాలయాన్ని అలాంటి ప్రదేశంలో ఏర్పాటు చేయడం పెద్ద తప్పిదమని వారు అభిప్రాయపడుతున్నారు.
“ఏడాది పొడవునా వాగు చిన్నగా కనిపించినా, వర్షాలు కురిసిన వెంటనే దాని ఉధృతి మూడింతలు పెరుగుతుంది. అలాంటి వాగు పక్కనే కార్యాలయం ఉండటం పెద్ద ప్రమాదమే” అని స్థానికులు పేర్కొన్నారు.
ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేసి వెంటనే ఉద్యోగులను సురక్షిత ప్రదేశానికి తరలించాలని, అలాగే కార్యాలయాన్ని శాశ్వతంగా వేరే ప్రదేశానికి మార్చాలని గ్రామస్తులు అధికారులు కోరుతున్నారు.







