స్థానిక సంస్థలు అలాగే, విద్య, ఉద్యోగాల కల్పనలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర శాసనసభ ఆమోదించిన రెండు బిల్లులకు వెంటనే చట్ట బద్ధత కల్పించాలని రాష్ట్ర మంత్రిమండలి గౌరవ రాష్ట్రపతి గారిని విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు బీసీ సంఘాల ప్రతినిధులు ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించారు.
❇️ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై సుదీర్ఘంగా చర్చించింది.
❇️ స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ గత మార్చి నెలలో శాసనసభలో ఆమోదించిన రెండు బిల్లులు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారికి పంపించడం జరిగింది.
❇️ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర హైకోర్టు విధించిన గడువు సమీపిస్తుండగా, ప్రస్తుతం బిల్లు రాష్ట్రపతి గారి వద్ద పెండింగ్‌లో ఉంది.
❇️ ఈ నేపథ్యంలో ఆగస్టు 5, 6, 7 తేదీల్లో నేరుగా కలిసి విజ్ఞప్తి చేయడానికి వీలుగా గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి అపాయింట్‌మెంట్ కోరాలని నిర్ణయించారు. రిజర్వేషన్ల సాధన కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, ఈ విషయంలో అన్ని పార్టీలు సహకరించాలని మంత్రిమండలి కోరింది.
✳️ మంత్రిమండలి నిర్ణయాలను మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు వాకిటి శ్రీహరి గార్లతో కలిసి మీడియా సమావేశంలో వివరించారు.







