ఎ9 న్యూస్, మెదక్:
రాయిన్పల్లి ప్రాజెక్టు మరమ్మతులు వెంటనే చేపట్టి రైతులకు సాగునీరు అందించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ నాయకురాలు ఎం. పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు.
రాయిన్పల్లి ప్రాజెక్టు పరిధిలోని హై లెవల్ కాల్వ ధోని దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె పేర్కొన్నారు. దాదాపు 2,500 ఎకరాల సాగుకు జీవనాడిగా ఉన్న ఈ ప్రాజెక్టును వెంటనే పునరుద్ధరించి రైతులకు నీటి సరఫరా పునఃప్రారంభించాలని కోరారు.
ఈ సమస్యపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని పద్మా దేవేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.








