మొయినాబాద్‌లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్‌హౌస్ మరోసారి వార్తల్లో నిలిచింది. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలు వివాదంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన అదే ప్రాంగణం, ఇప్పుడు డ్రగ్స్ పార్టీ, కాల్పుల కలకలం తో మళ్లీ హాట్ టాపిక్ అయింది.
నాడు రాజకీయ ప్రకంపనలు – ఎమ్మెల్యేల కొనుగోలు కేసు:
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో కూడా పెద్ద దుమారం రేపింది. ఆ ఘటనతో రోహిత్ రెడ్డి పేరు ఒక్కసారిగా వెలుగులోకి రావడమే కాకుండా, విచారణ సంస్థల చుట్టూ తిరిగేలా చేసింది.
నేడు డ్రగ్స్ పార్టీ – రివర్స్ సీన్;
అప్పట్లో ఫిర్యాదుదారుడిగా ఉన్న రోహిత్ రెడ్డి, ఇప్పుడు అదే ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలో ప్రధాన నిందితుడిగా మారడం గమనార్హం. ఈసారి ఈగల్ టీమ్ నిర్వహించిన మెరుపు దాడుల్లో స్వయంగా రోహిత్ రెడ్డికే డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు వార్తలు రావడం ఆయన రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. గతంలో పోలీసులకు సహకరించిన అదే ప్రాంగణంలో, ఈసారి పోలీసులపైనే కాల్పులు జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ఒకే వేదిక.. వేర్వేరు వివాదాలు:
ఒకప్పుడు రాజకీయ కుట్రలకు కేంద్రంగా ప్రచారంలోకి వచ్చిన ఈ ఫామ్‌హౌస్, ఇప్పుడు డ్రగ్స్ కల్చర్‌కు చిరునామాగా మారింది. గతంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టే ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు వస్తే, ఇప్పుడు ప్రముఖ రాజకీయ నేతలు, ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేల సమక్షంలో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ నిర్వహించడం చర్చనీయాంశమైంది. రెండు ఘటనల్లోనూ సాక్ష్యాల ధ్వంసం అనే అంశం ఉమ్మడిగా కనిపిస్తోంది.
బయటకు తెలియనివి ఇంకెన్ని జరిగాయో?
గతంలో జరిగిన ఘటన రాజకీయ పోరాటంగా సాగితే, ప్రస్తుత ఘటన నేరపూరిత కోణంలో సాగుతోంది. పోలీసులపై కాల్పులు జరగడం, ఆయుధ చట్టం ఉల్లంఘన వంటివి ఉండటంతో ఈ కేసు రోహిత్ రెడ్డికి గత కేసు కంటే ఎక్కువ ఇబ్బందులు తెచ్చిపెట్టేలా ఉంది. బయటపడినవే ఇలాంటి సంచలనాలు ఉంటే..బయటపడకుండా.. ఇంకెన్ని జరిగాయోనని గుసగుసలు వినిపిస్తున్నాయి.







