హెల్మెట్, సీట్‌బెల్ట్ తప్పనిసరి – అతివేగమే ప్రమాదాలకు ప్రధాన కారణం….

On: Saturday, January 17, 2026 3:07 PM

“మీ కోసం కాదు… మీ కుటుంబం కోసం హెల్మెట్”…..                                                  మెదక్ 

జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్

మెదక్ | జనవరి 17 (ఈ9 న్యూస్):

శనివారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పరేడ్‌లో జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ పాల్గొని గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పరేడ్‌ను పరిశీలించిన ఆయన, విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలనతో పాటు శారీరక దృఢత్వం ఎంతో కీలకమని పోలీస్ అధికారులు, సిబ్బందికి సూచించారు. ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.

“Arrive Alive” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని, నిర్ణీత వేగ పరిమితుల్లోనే వాహనాలు నడపాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలలో అధిక వేగం, అజాగ్రత్త వాహన నిర్వహణే ప్రధాన కారణమని తెలిపారు.

రాష్ట్రంలో హత్యల కంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలకు యువత ఎక్కువగా బలవుతుండటం తీవ్ర ఆవేదన కలిగిస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

“అతివేగం కుటుంబాలను అనాథల్ని చేస్తుంది” అని ఆయన హెచ్చరించారు.

సిబ్బంది ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత క్షేమంగా తిరిగి చేరేవరకు వారి కుటుంబాలు ఎదురుచూస్తాయని గుర్తు చేస్తూ, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు.

ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ సిబ్బందితో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞను చేయించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ రంగా నాయక్, సీఐలు జార్జ్, మహేష్, ఎస్‌ఐలు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

05 Feb 2026

Leave a Comment