బదిలీలు రద్దు చేసేవరకు ఉద్యమం ఆగదు: జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు.
మెదక్ జిల్లా ,చేగుంట మండలం, గడియారం గ్రామ శివారులో ఉన్న APL అపోలో ట్యూబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న ముగ్గురు కార్మికులను యాజమాన్యం అక్రమంగా బదిలీ చేసినట్టు యూనియన్ నేతలు ఆరోపించారు.
ఈ చర్యను నిరసిస్తూ గత నాలుగు రోజులుగా పరిశ్రమ ఎదుట కార్మికులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శుక్రవారం నిర్వహించిన వంటవార్పు కార్యక్రమంలో జిల్లా, రాష్ట్ర కార్మిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జనరల్ సెక్రటరీ కుళ్ళ నరసింహులు మాట్లాడుతూ:
“బదిలీ చేసిన ముగ్గురు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునే వరకు ఉద్యమం ఆగదు. ఇది సాధించే వరకు ఎన్ని రోజులు అయినా సమ్మె కొనసాగుతుంది. యాజమాన్యం తక్షణమే తమ మొండి వైఖరి వదిలి కార్మికులపై తీసుకున్న చర్యను వెనక్కి తీసుకోవాలి,” అన్నారు.
అలాగే, “మనలో విభజన సృష్టించి, కాలయాపన చేయాలని యాజమాన్యం భావిస్తోంది. కానీ ఎవ్వరూ వారి మోసానికి లోనవ్వకండి. న్యాయంగా పోరాడితే విజయం మనదే,” అని స్పష్టం చేశారు.
ఈ నిరసనలో ప్రతి రోజు 69 మంది కార్మికులు దీక్షలో పాల్గొంటున్నారు.
యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ నరసింహులు, కోశాధికారి కుంట రాజకుమార్, శ్రీనివాస్, నవీన్ యాదవ్, పెద్ద కృష్ణ, సునీల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.








