హైదరాబాద్, సెప్టెంబర్ 1: తెలంగాణ దేవాదాయ భూముల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ ఎండోమెంట్ యాక్ట్, 1987 చాప్టర్ XI సవరణకు కసరత్తు చేస్తోంది. సెక్షన్స్ 83, 84 తొలగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు బిల్లు ప్రవేశపెట్టనుంది.
ట్రిబ్యునల్, కోర్టు కేసులతో దర్జాగా వేల ఎకరాలు కబ్జా చేస్తున్న వాళ్ల ఆటకట్టించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు చర్యలు చేపట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వందల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని వీటన్నింటిని పరిరక్షించాలని ప్రభుత్వం చూస్తోంది. కబ్జాకోరల్లో చిక్కుకున్న వేల కోట్ల విలువైన దేవాదాయ భూములు రక్షించేందుకు నడుంబిగించింది.
దేవాలయ, చారిటబుల్ సంస్థలకు చెందిన భూములు, భవనాల్ని ఎవరు ఆక్రమించినా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఎండోమెంట్ అధికారులు, అవసరమైతే పోలీసు, హైడ్రా సాయంతో ఆక్రమణలు తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది..








