హైదరాబాద్ పల్స్ న్యూస్, అక్టోబర్ 14 (బాల్కొండ): నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలంలోని రహత్‌నగర్ గ్రామంలో సోమవారం ఉదయం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో మూడు సంవత్సరాల చిన్నారి మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
వివరాల్లోకి వెళ్తే, కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు చెందిన బస్సు (నంబర్ TS03 UB 4394) డ్రైవర్ జి.మధు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో విద్యార్థులను తీసుకువెళ్లేందుకు రహత్‌నగర్‌కు చేరుకున్నాడు.ఈ సమయంలో గ్రామానికి చెందిన శిరీష తన పెద్ద కుమారుడిని బస్సులో ఎక్కిస్తుండగా,ఆమె చిన్న కుమారుడు శ్రీకాంత్ (వయసు 3 సంవత్సరాలు) బస్సు ముందు ఆడుకుంటూ ఉన్నాడు.
అయితే డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సును ముందుకు తీసుకెళ్లడంతో చిన్నారి బస్సు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే స్థానికులు బాలుడిని ఆసుపత్రికి తరలించినా, మార్గమధ్యంలోనే అతను మృతి చెందాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని భీంగల్ ఎస్సై సందీప్ తెలిపారు.








