రాజకీయ దురుద్దేశంతోనే ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారు..

On: Monday, November 3, 2025 8:08 PM

 

కేసీఆర్‌పై సీఎం రేవంత్ ఫైర్…

రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు ను పక్కకు పెట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పులు చేసి.. అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్‌ని పక్కన బెట్టారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలని క్షమించరని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌ని తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్‌‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్‌బీసీ విషయంలో తమ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. నాగర్ కర్నూల్ జిల్లాలోని ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రాంతంపై సీఎం రేవంత్‌‌రెడ్డి జియో ఫిజికల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నెవారిపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

ఏ ప్రాజెక్టునూ కేసీఆర్‌ పూర్తి చేయలేదు..

గత పదేళ్లలో ఏ ప్రాజెక్టునూ కేసీఆర్‌ పూర్తి చేయలేదని మండిపడ్డారు. ఇప్పుడు ఆయా ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరం చెబుతోందని పేర్కొన్నారు. కేసీఆర్‌ నిర్వాకం వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అలుసైపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉండి ఉంటే టన్నెల్‌ పనులు ఎప్పుడో పూర్తయ్యేవని చెప్పుకొచ్చారు. ఎస్ఎల్‌బీసీని గత కేసీఆర్ ప్రభుత్వం గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. కమీషన్లు రావని మాజీ సీఎం కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎస్ఎల్‌బీసీని పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 10 కిలోమీటర్లు కూడా టన్నెల్‌ పనులు పూర్తికాలేదని చెప్పుకొచ్చారు. టన్నెల్‌ పూర్తి చేస్తే కాంగ్రెస్‌కు పేరొస్తుందనే కారణంతోనే గాలికొదిలేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

1983లో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు మంజూరు..

30 టీఎంసీల తరలింపు, 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో 1983లో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు మంజూరైందని గుర్తుచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2004లో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఎస్ఎల్‌బీసీ టన్నెల్-1, టన్నెల్-2 పనులను ప్రారంభించారని చెప్పుకొచ్చారు. రూ.1968 కోట్లతో టెండర్లు పిలిచారని గుర్తుచేశారు. ఈ దేశంలోనే తొలిసారిగా ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌కు టన్నెల్ బోర్ మిషన్‌‌ని ఉపయోగించారని వివరించారు. 2014 వరకు కిలోమీటరు వరకు టన్నెల్ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలోని పదేళ్లలో పది కిలోమీటర్ల వరకు కూడా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు తమ ప్రభుత్వంలో గ్రావిటీ ద్వారా నల్గొండకు నీళ్లు తీసుకెళ్లాలనుకుంటే అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్‌రెడ్డి.

తెలంగాణకు రికార్డు..

ప్రపంచంలో 40 కిలోమీటర్ల టన్నెల్ ఎక్కడా లేదని చెప్పుకొచ్చారు. ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణకు ఆ రికార్డు దక్కుతుందని ఉద్ఘాటించారు. ఆనాడు రూ.2 వేల కోట్ల ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తయ్యేదని స్పష్టం చేశారు. ఇప్పుడు పెరిగిన అంచనాలతో రూ.4600 కోట్ల మేర ఖర్చవుతోందని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకపోవడమే కాదని.. కృష్ణా నదిపై ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. కేసీఆర్ పదేళ్లలో రూ.1.86 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చారని ఫైర్ అయ్యారు. అందులో రూ.1.5 లక్షల కోట్లు కాళేశ్వరం కోసమే ఖర్చు చేశారని మండిపడ్డారు. కృష్ణాలో తెలంగాణ వాటాని మనం తీసుకోకపోవడం వల్ల ఆ నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోతోందని చెప్పుకొచ్చారు. 299 టీఎంసీలు చాలని ఆనాడు హరీశ్‌రావు సంతకం పెట్టి వచ్చారని ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.

ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తా..

తెలంగాణ వాటా మనకు దక్కాల్సిందేనని ట్రిబ్యునల్‌లో ఈ విషయంపై తాము వాదనలు వినిపిస్తూ ఒక కొలిక్కి తీసుకొస్తున్నామని వివరించారు. ఇంత తక్కువ ఖర్చుతో 30 టీఎంసీల నీటిని తీసుకెళ్లే ప్రాజెక్టు దేశంలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టు పనులు మొదలు పెట్టామని తెలిపారు. అయితే, ఈ పనుల నేపథ్యంలో దురదృష్టవశాత్తూ 8 మంది కార్మికులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు బాధ ఉన్నా.. ఆ కుటుంబాలను ఆదుకుని పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆర్మీలో ఉన్న పరిచయాలతో ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ముంపునకు గురవుతున్న మర్లపాడు, కేశ్యతండా, నక్కలగండి తండా ప్రజలను ఆదుకుని, డిసెంబర్ 31వ తేదీలోగా సమస్యలని పరిష్కరిస్తామని మాటిచ్చారు. ఇప్పుడు కాకపోతే ఈ ప్రాజెక్టును ఇంకెప్పుడూ పూర్తి చేసుకోలేమని చెప్పుకొచ్చారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా పరిష్కరించి ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోకపోతే నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలకు తీరని నష్టం కలుగుతుందని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు..

11 Nov 2025

Leave a Comment