ఆలూరు మండలం రామచంద్రపల్లి గ్రామపంచాయతీ నూతన పాలకవర్గాన్ని ఆశీర్వదించేందుకు రాజ్యసభ సభ్యులు కే.ఆర్. సురేష్ రెడ్డి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రామచంద్రపల్లి గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అభ్యర్థి తొగరి భూషణ్, గ్రామ ప్రజల తరపున ఎంపీ కే.ఆర్. సురేష్ రెడ్డిని కలిసి గ్రామాభివృద్ధి కోసం వినతి పత్రాన్ని అందజేశారు.
వినతి పత్రంలో గ్రామానికి అవసరమైన మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను సర్పంచ్ అభ్యర్థి ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా ఎన్‌హెచ్–63 నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు కరెంట్ స్తంభాలు, వీధి దీపాల ఏర్పాటు కోసం రూ.5 లక్షలు, గ్రామంలో గ్రంథాలయ నిర్మాణానికి రూ.5 లక్షలు, హనుమాన్ ఆలయ ఆవరణలో సీసీ ఫ్లోరింగ్ పనుల కోసం రూ.8 లక్షలు, సీఎస్ఐ చర్చి అభివృద్ధి పనులకు రూ.8 లక్షలు, అలాగే గ్రామ కూడలి వద్ద హైమాస్ లైట్ ఏర్పాటు కోసం రూ.3 లక్షలు మంజూరు చేయాలని కోరారు.
ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు మంజూరు చేసి, రామచంద్రపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు సహకరించాలని గ్రామ ప్రజలందరి తరపున ఎంపీ కే.ఆర్. సురేష్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించారు. గ్రామాభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని ఎంపీ హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజల్లో హర్షం వ్యక్తమైంది.








