హైదరాబాద్, అక్టోబర్ 7: తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. రాజకీయ పార్టీ గుర్తింపు, గుర్తుపై హైకోర్టులో మల్లన్న పిటిషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పించాలని పిటిషనర్ నవీన్ కోరారు. ఈ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్ అభ్యర్థనను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
కాగా.. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు, రాజ్యాధికారం లక్ష్యంగా ఇటీవల తెలంగాణ రాజ్యాధికార పార్టీని తీన్మార్ మల్లన్న స్థాపించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న తాజ్ కృష్ణ హోటల్‌లో పార్టీని స్థాపించారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండాను ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో రూపొందించారు. జెండా మధ్యలో పిడికిలి బిగించిన చేయితో పాటు కార్మిక చక్రం, వరి కంకులు ఉన్నాయి. జెండాపై భాగంలో ఆత్మగౌరవం, అధికారం, వాటా నినాదాలను రాశారు. పిడికిలి కింది భాగంలో పార్టీ పేరును ముద్రించారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని న్యాయస్థానాన్ని మల్లన్న కోరడం.. చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో… మల్లన్నకుఎన్నికల సంఘం ఎలాంటి గుర్తును కేటాయిస్తుందో చూడాలి మరి..








