చౌటకూర్: భావి సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావిణ్య అన్నారు. శుక్రవారం ఆమె చౌటకూర్ మండల కేంద్రంలో ఆకస్మిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా బస్తీ దవాఖాన, అంగన్వాడీ కేంద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు.
మొదటగా బస్తీ దవాఖానలో రోగులకు అందుతున్న సేవలను కలెక్టర్ పరిశీలించారు. మందుల లభ్యత, జ్వర చికిత్స రికార్డులను పరిశీలించి, సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా గ్రామపంచాయతీల సిబ్బంది ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు
తరువాత అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, చిన్నారుల ఆరోగ్యం, బరువులు పరిశీలించారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతను పరిశీలించి, భోజనం చేస్తున్న చిన్నారులను చూసి సంతోషం వ్యక్తం చేశారు.
తదుపరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటుబుక్స్ లభ్యత, డిజిటల్ బోధన విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంపొందించి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
“బావి భారత్ నిర్మాణం తరగతి గదుల్లోనే అవుతుంది. బాపూజీ కలలు నిజం కావాలంటే ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో తమ బాధ్యతను మరువకూడదు,” అని కలెక్టర్ అన్నారు.
పాఠశాలలో అమలు చేస్తున్న ముఖ గుర్తింపు హాజరు విధానాన్ని కూడా కలెక్టర్ పరిశీలించారు. విద్యా, వైద్య రంగాల్లో నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, పంచాయతీ రాజ్ అధికారులు, వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులు, శిశు సంక్షేమాధికారులు తదితరులు పాల్గొన్నారు








