మొంథా తుఫాన్ ప్రభావంతో 12 జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు ఎవరూ అధైర్యపడొద్దని.. అందర్నీ ఆదుకుంటామని భరోసా కల్పించారు. వర్షాలు తగ్గాయి కాబట్టి పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని అధికారులని ఆదేశించారు.శుక్రవారం వరంగల్ జిల్లాలోని కాపువాడలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. అలాగే, పోతననగర్‌లో ముంపు ప్రాంతాలని పరిశీలించారు. అనంతరం మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.
మొంథా తుఫానుపై ఆస్తి, పంట నష్టం అంచనాలు చేసే సమయంలో ప్రజాప్రతినిధులను తీసుకెళ్లాలని సూచించారు. ఇన్‌చార్జ్ మంత్రులు, కలెక్టర్లతో నివేదికలు తయారుచేయాలని ఆదేశించారు. ప్రాణ నష్టం, పశు సంపద నష్టంపై నివేదికలు తెప్పించాలని ఆజ్ఞాపించారు. తుఫానుకి దెబ్బతిన్న రోడ్లపై నివేదికలు తెప్పించాలని ఆదేశించారు. అన్ని నివేదికలు సమీకరించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాబట్టాలని సూచించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమని కేంద్ర ప్రభుత్వం వదిలేస్తే కుదరదని హెచ్చరించారు. క్లౌడ్ బరస్ట్‌లు భవిష్యత్‌లోనూ వస్తాయని తెలిపారు. వర్ష ప్రభావిత సమస్యలను అధిగమించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు సీఎం రేవంత్‌రెడ్డి.
పూర్తి నివేదికలు వస్తే కేంద్ర ప్రభుత్వానికి పరిహారం కోసం రిక్వెస్ట్ పంపిస్తామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు కేంద్ర నిధులు కూడా తెచ్చుకుందామని తెలిపారు. గతంలో కేంద్ర నిధులు వాడుకోలేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయి వచ్చేలా రాష్ట్ర అధికారులు నివేదికలు తయారు చేయాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు, కలెక్టర్ల మధ్య సమన్వయం ఉండాలని ఆదేశించారు. శాఖల మధ్య సమన్వయం లేకపోతే నష్టం జరుగుతుందని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి.
పారిశుద్ధ్య కార్యక్రమాలు వెంటనే చేపట్టాలని ఆజ్ఞాపించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ఇస్తున్నామని ప్రకటించారు. పొలాల్లో ఇసుక మేటలు తొలగించేందుకు ఎకరాకు రూ.లక్ష అయినా ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇండ్లు, పంటలు, పశువుల నష్టంపై పూర్తి నివేదిక కావాలని ఆదేశించారు. అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పూర్తిస్థాయి నష్టాన్ని అంచనా వేయాలని ఆజ్ఞాపించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ప్రాణ నష్టం, పంట నష్టం, పశు సంపద, అన్ని శాఖలకు సంబంధించి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నష్టానికి సంబంధించి నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. ఇందుకు ప్రజాప్రతినిధుల సహకారం కూడా తీసుకోవాలని ఆదేశించారు. ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాలకు సంబంధించి కలెక్టర్లకు రిపోర్ట్ ఇవ్వాలని సూచించారు. ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందజేస్తామని పేర్కొన్నారు. దెబ్బతిన్న ప్రతి ఇంటికీ రూ.15 వేల చొప్పున ఆర్థికసాయం అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇండ్లు మునిగిన వారికి ప్రతీ ఇంటికి రూ.15 వేలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులైన వారిని గుర్తించి వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు..








