* ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్‌లో పోటీ చేయాలి: పైడి రాకేష్ రెడ్డి సవాల్….
*ఇరవత్రి అనిల్ కి ఇదే చివరి హెచ్చరిక….
.*రాజకీయం కాదు అభివృద్ధిలో చూపియ్యాలి….
*మీడియా సమావేశంలో పైడి రాకేష్ రెడ్డి ఆగ్రహం….
A9 న్యూస్
నిజామాబాద్: పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఆర్మూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సవాల్ విసిరారు. తాను కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని, గెలుపు–ఓటమిని ప్రజలే నిర్ణయిస్తారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన జిల్లా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పటి వరకు అన్ని పార్టీల నాయకులతో స్నేహపూర్వక రాజకీయాలు చేయాలని ప్రయత్నించినప్పటికీ, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ నాయకుడు ఇరవత్రి అనిల్ వ్యక్తిగత విమర్శలకు దిగడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలకు తావులేకుండా అభివృద్ధి అంశాలపైనే చర్చ జరగాలని సూచించారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించిన రాకేష్ రెడ్డి, ప్రభుత్వం నిజామాబాద్ జిల్లాకు తగిన నిధులు కేటాయించలేదన్నారు. తాను పలుమార్లు లేఖలు రాసినా అభివృద్ధి నిధుల మంజూరులో స్పందన లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇరవత్రి అనిల్ తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని ఆరోపించిన ఆయన, ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే సహించబోమని హెచ్చరించారు. ప్రత్యక్ష రాజకీయాల్లోనే తలపడాలని, ప్రజల తీర్పును గౌరవించాలని అన్నారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు కీలకంగా మారనున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూతల శ్రీనివాస్, నిజామాబాద్ జిల్లా ఫ్లోర్ లీడర్ ప్రమోద్, నాగుల లక్ష్మీనారాయణతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.








