రాజకీయ ప్రయోజనాలకు కాకుండా చట్టబద్ధంగా బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి: నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్…

On: Tuesday, August 26, 2025 7:13 PM

 

ఎ9 న్యూస్, సిద్దిపేట, ఆగస్టు 26:

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు విషయంలో చిత్తశుద్ధితో, రాజకీయం లేకుండా వ్యవహరించాలంటూ నిరుపేదల హక్కుల సాధన సమితి డిమాండ్ చేసింది.

సమితి కన్వీనర్ మూర్తి ఆగిరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తుచేశారు. ఇది కేవలం పార్టీల హామీగా కాకుండా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243D (6) ప్రకారం చట్టబద్ధంగా అమలు చేయాలని కోరారు.

అత్యంత వెనుకబడిన బీసీ కులాలు — అగ్నికుల క్షత్రియ, దాసరి, వడ్డెర, దొమ్మర, బుడబుక్కల, బోయ, గంగిరెద్దుల, జంగం, పంచాల, వాల్మీకి, మేదరి, మూడెవురు, కంజర్, తదితరులకు — ఈ రిజర్వేషన్ నేరుగా ప్రయోజనం చేకూరేలా చేయాలని విజ్ఞప్తి చేశారు.

అలాగే ముస్లింల మధ్యలో కూడా సామాజిక వెనుకబాటుదనం ఉన్నట్టు గుర్తించారు. అత్తరోలు, చాకలి ముస్లింలు, ఫకీరులు, గారడీ ముస్లింలు వంటి అనేక వెనుకబడిన వర్గాల ముస్లింలకు రిజర్వేషన్ లభించేటట్లుగా చూడాలని సమితి అభిప్రాయపడింది.

బీసీల పేరుతో మతరహితంగా, నిజమైన నిరుపేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు. కేవలం రాజకీయ నాయకులకు లబ్ధి చేకూర్చే విధంగా కాకుండా, విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో వాస్తవానికి అనుగుణంగా అమలు కావాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న బీసీ నాయకులు స్పందించాలని మూర్తి ఆగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.

13 Jan 2026

Leave a Comment