ఆర్మూర్, అక్టోబర్ 10:
ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రయత్నిస్తుండగా కుటుంబ సభ్యుల వేధింపులకు గురై మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆర్మూర్ పట్టణంలో చోటుచేసుకుంది. జక్రన్ పల్లి మండలం సికింద్రాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మౌనిక (భర్త గణేష్) క్రిమిసంహారక మందు తాగి ప్రాణాపాయ స్థితిలో ఆర్మూర్ ఎంజే ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
భర్త గణేష్ తెలిపిన వివరాల ప్రకారం – పాత ఇంటిని కూల్చివేసి, ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే తండ్రి కిషన్, బాబాయిలు రాము, హరి, విట్టల్, రేణుకలు ఇంటి నిర్మాణం జరగకుండా అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. పాత ఇంటి రిజిస్ట్రేషన్, ఇల్లు టాక్స్, కరెంట్ బిల్లు లాంటి ఖర్చులు తానే భరిస్తున్నానని తెలిపారు.
ఇల్లు రిజిస్ట్రేషన్ విషయమై బాబాయిల సూచన మేరకు పత్రాలు చేసుకున్నా, ఇప్పుడు అదే కారణంగా వారు ఇల్లు కట్టుకోనివ్వడంలేదని గణేష్ వాపోయారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు, జక్రన్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా ఎస్సై ఫిర్యాదు స్వీకరించలేదని ఆయన ఆరోపించారు.
గత కొద్ది రోజులుగా బంధువులు వేధింపులు చేస్తూ, ప్రాణహాని బెదిరింపులు కూడా చేస్తున్నారని తెలిపారు. శుక్రవారం రోజున తీవ్ర వాగ్వాదం జరిగిన తర్వాత రాథోడ్ మౌనిక ఆవేదనకు గురై ఇంట్లోనే క్రిమిసంహారక మందు తాగిందని గణేష్ తెలిపారు. ఆమెను తక్షణమే ఆర్మూర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతోందన్నారు.
నా భార్య ఆత్మహత్యాయత్నానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గణేష్ అధికారులను కోరారు.








