రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని, అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు సూచించారు.
మరోవైపు… మీర్జాగూడలో ప్రమాదంపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన సంబంధించి వివరాలు, కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో మాట్లాడారు. అలాగే, క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు మంత్రి పొన్నం సూచించారు. ఆర్టీసీ అధికారులు ఘటన స్థలానికి వెళ్లాలని మంత్రి ఆదేశించారు.
ఇదిలా ఉండగా.. మీర్జాగూడ వద్ద తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మూడు జేసీబీల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది
ఆర్టీసీ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో చదువుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు కావడంతో ఇళ్లకు వెళ్లి.. తిరిగి నగరానికి వస్తుండగా ఈ ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి.








