ఇందిరమ్మ ఇండ్ల పథకం లబ్దిదారులకు నాలుగు విడతలుగా అందచేస్తున్న బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ప్రభుత్వం స్వల్ప మార్పులు చేసినట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద 90 పని దినాలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం (ఐహెచ్ హెచ్ఎల్ ) పనులను చేసుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున ఈ మార్పు అనివార్యమైందని ఆయన తెలిపారు.
కేవలం చెల్లింపుల షెడ్యూల్ లో మాత్రమే మార్పులు జరుగుతున్నాయి తప్పితే, లబ్ధిదారులకు మంజూరు చేసే రూ. 5 లక్షల మొత్తంలో ఎలాంటి మార్పు ఉండదని మంత్రి స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో బేస్ మెంట్ వరకూ నిర్మాణం పూర్తి అయితే ఒక లక్ష రూపాయలు, రూఫ్ లెవల్ వరకు వచ్చిన తరువాత మరో లక్షరూపాయలు విడుదల చేస్తున్నారు. అలాగే ప్రస్తుతం రూఫ్ పూర్తి అయిన తరువాత లబ్ధిదారులకు రూ.2 లక్షలను చెల్లిస్తున్నారు. ఉపాథి హామి పథకం ద్వారా కలుగుతున్న లబ్ధి (90 రోజుల పనిదినాల మొత్తం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం నిమిత్తం నిర్దేశించిన మొత్తం) వారి ఖాతాల్లోకే నేరుగా జమ అవుతుంది,
ఈ నేపథ్యంలో లబ్ధిదారులు ఇంటి శ్లాబ్ వేసిన తరువాత చెల్లించే మొత్తాన్ని రూ.1.40 లక్షలుగా అందేచేయాలని ప్రభుత్వం నిర్ణయించనట్లు మంత్రి వివరించారు. ఇకపై శ్లాబ్ పూర్తి అయిన తరువాత రూ.1.40 లక్షలను మాత్రమే లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయని, మిగిలిన మొత్తాన్ని (రూ.60 వేలను) కూడా లబ్దిదారుల ఖాతాల్లో ఉపాథి హామీ పథకం కింద అందచేస్తారని తెలిపారు. అట్లాగే ఇంటి నిర్మాణం పూర్తి అయిన తరువాత మిగిలిన లక్ష రూపాయలను విడుదల చేస్తారు.
పరిపాలనా సౌలభ్యం రీత్యా ఈ మార్పులు అనివార్యమయ్యాయని, లబ్ధిదారులు ఈ మార్పును గమనించి ప్రభుత్వంతో సహకరించాల్సిందిగా మంత్రి కోరారు.








