లొంగి పోయిన ʹమావోయిస్టుʹలకు మావోయిస్టు పార్టీ విజ్ఞప్తి…..

On: Monday, October 13, 2025 7:20 AM

 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మావోయిస్టుల ప్రకటన.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) పశ్చిమ్ సబ్ జోనల్ బ్యూరో గడ్ చిరోలీ మహారాష్ట్ర , అధికార ప్రతినిధి కే. శ్రీనివాస్విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం….

*లొంగిపోయిన ʹమావోయిస్టుʹలారా! జాగ్రత్త*

ఎ9 న్యూస్ డెస్క్ హైదరాబాద్ అక్టోబర్ 12

మీ జీవితాలు ఖాకీల ముందు ఎలా ఉన్నాయో మాకు తెలుసు. ఛత్తీస్ గఢ్ పోలీసులు ʹలోన్ వర్రట్ʹ పేరుతో ప్రారంభించిన బూటకపు లొంగుబాటు పథకాన్ని నమ్మి ఇటీవలే 2021 ఫిబ్రవరి 19న బీజాపులో పోలీసులకు లొంగిపోయిన చేతనా నాట్య మంచ్ కళాకారిణి పందొమ్మిదేళ్ల కామ్రేడ్ పాండే కోవాసీని పోలీసులు ఎంత క్రూరంగా హత్య చేసి ఆత్మహత్య కట్టుకథ అల్లారో మీరు వినే ఉంటారు. మన బస్తర్ అదివాసీ తెగ పెద్దలు సహా ప్రజలంతా పోలీసుల హత్యను ఖండిస్తున్నారు. కామ్రేడ్ పాండే తల్లి తండ్రులు కూతురు శవాన్ని తీసుకో నిరాకరించారు. పాండే మరణానికి కారణాలను కోరిన సామాజిక కార్యకర్త సోనీసోడిని జిల్లా ఎస్పీ తమ పోలీసుల నేరాన్ని అంగీకరించకుండా అమెనే ఉల్టా దబాయించాడు. గడ్ చిరోలీ, ప్రాణహిత క్యాంపులలో మీ బతుకులు ఎంత ఘోరంగా ఉన్నాయో మీ కుటుంబాల ద్వార మాకు వెంట వెంట తెలుస్తునే ఉంది. ఆ బతుకు సుడిగుండం నుండి మీరు బయటకు రావాలనే మా విజ్ఞప్తి. మన ఆదివాసులెవరూ బానిస బతుకును కోరుకోరు. అలోచించండి. .

విప్లవోద్యమంలో మీరు ఎంతో గౌరవంగా ప్రజాస్వామిక జీవితాన్ని గడిపారు? ముఖ్యంగా మహిళలు పార్టీలో ఏ వత్తిళ్లు లేకుండా, రాజకీయంగా ఏ వివక్ష లేకుండా, గౌరవప్రదంగా, ప్రజాస్వామికంగా గెరిల్లా జీవితాన్ని అనుభవించారు. విప్లవోద్యమంలో ఉన్నపుడు మిమ్మల్ని ప్రజలు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. కానీ, మీరు వాటన్నింటిని కాలతన్ని ఉద్యమంలో ఎదురయ్యే కష్టాలను, ఇబ్బందులను, చిన్న చిన్న సమస్యలను పార్టీ పద్ధతులలో పరిష్కరించుకోవడంలో విఫలమై మీమీ వ్యక్తిగతమైన బలహీనతలతో వెళ్లి పోలీసుల ముందు లొంగిపోయారు. మీలో ఇపుడు కొందరు పోలీసులకు గైడులుగా, కళ్లు, చెవులుగా, నమ్మకమైన సమాచార వాహకులుగా పని చేస్తున్నారు. మహిళల జీవితాలు అత్యాచారాల కుంపటిలో భగ్గుమంటున్నాయి. వీటిని ఇంకెంత కాలం భరిస్తారు! వద్దు. మీకు అ జీవితాలు వద్దు. వచ్చి మీ మీ గ్రామాలలో ఉండండి.

పోలీసు అధికారుల మోసపు హామీలకు బలై వారికి అన్ని రకాలుగా సహకరిస్తున్నవారు ప్రజా ఉద్యమానికి తీరని నష్టాన్ని కలిగిస్తున్నారు. అలాంటి వారిని అసహ్యించుకుంటు శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేయడం మీకు తెలిసిందే. మీరు అదే జీవితాన్ని కొనసాగిస్తే ప్రజలు ఎన్నటికైనా మిమ్మల్ని శిక్షించి తీరుతారు. కాబట్టి, పోలీసుల ముందు కడుహీనమైన జీవితాన్ని గడుపుతున్న మీరు దానికి ధైర్యంగా స్వస్తి చెప్పి వినమ్రంగా ప్రజలతో కలిసి మీ కుటుంబాలతో జీవించండి. పోలీసుల గాలింపు చర్యలలో పాల్గొనకండి. నిన్నటివరకు మీరు ప్రజల కోసం పోరాడినవారే. మన పోరాటం న్యాయమైనదని మీరంతా నమ్మినవారే. నిజానికి మీలో ఏ ఒక్కరికి పోరాటంతో విభేదం ఉండదు. పోలీసు అధికారులకు భయపడి మీరు మీడియా ముందు చెప్పే మాటలు కోడి ఈక కన్నా తేలికైనవని మీకూ, పోలీసులకూ తెలుసు. కాబట్టి

మీరు మీ స్వార్థంతో ప్రజలకు, విప్లవోద్యమానికి ఎంతమాత్రం ద్రోహం చేయకుండా, దానిని సమూలంగా మట్టుబెట్టాలనే పాలకుల కుట్రలకు బలికాకుండా పార్టీ చేస్తున్న ఈ విజ్ఞప్తిని ఖాకీల ఎంగిలి మెతుకులకు ఆశపడి నిర్లక్ష్యం చేయకండి.

గ్రామసభలకు విజ్ఞప్తి! మీ ఊరికి చెందిన లొంగిపోయిన మావోయిస్టుల గురించి అలోచించాలి. మీ ఊరి నుండి ఎవరు పోలీసులకు లొంగిపోయినా, మీరే బాధ్యత పడి వారిని పోలీసుల చెర నుండి విడిపించి వారి కుటుంబాలతో జీవించేలా చూడండి. పోలీసులు చేసే బెదరింపులకు భయపడకుండా చట్టపరంగానే వారిని వారి కుటుంబాలతో జీవించేలా చూడండి. పోలీసుల వెంట అడవులలోకి, గ్రామాలలోకి రావద్దని చెప్పండి. నక్సల్ గాలింపు చర్యలలో పోలీసులకు సహకరించి ప్రజలకు నష్టాన్ని కలిగించవద్దని వివరించండి. భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అన్ని హక్కులు వారికి వర్తించేలా గ్రామసభలే బాధ్యత పడాలి. వారిని గ్రామసభ సభ్యులుగా చేర్చుకొని వారు మీలో ఒకరిగా జీవితాన్ని గడిపేలా చూడాలని మా విజ్ఞప్తి. మీ మాట వినని వారిని గ్రామాల నుండి బహిష్కరించండి. వారితో గ్రామసస్థులు ఎవరు సంబంధాలు పెట్టుకున్నా గ్రామసభలలో విచారించండి.

కే. శ్రీనివాస్, అధికార ప్రతినిధి,

పశ్చిమ సబ్ జోనల్ బ్యూరో, దండకారణ్యం

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు).

11 Nov 2025

Leave a Comment